ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
ఏబీవీపీ రాష్ట్ర పిలుపుతో జడ్చర్లలో కళాశాలల బంద్ విజయవంతం
జడ్చర్ల, జూలై 14 (మనఊరు ప్రతినిధి): ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జడ్చర్ల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కళాశాలల బంద్ నిర్వహించారు. విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు కళాశాలల వద్ద నిరసన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో రూ.11 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు చదువులు మధ్యలోనే మానేస్తున్నారని, వేలాది మంది తమ విద్యా సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్నత విద్యను కొనసాగించలేక విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లించి, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెలా కళాశాలలకు ఫీజులు విడుదల చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే ముఖ్యమంత్రి విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఆ హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. ఈ అంశం న్యాయస్థానం దృష్టికి వెళ్లడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రైవేట్ కళాశాలలు, ప్రభుత్వం కలిసి వ్యవహరిస్తున్న తీరుతో విద్యార్థులే నష్టపోతున్నారని, బడ్జెట్ కళాశాలలు సైతం మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉపాధి కోసం లెక్చరర్లుగా పనిచేస్తున్న నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుర్భర పరిస్థితులకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విద్యార్థుల హక్కులని, అవి ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు కాదని స్పష్టం చేశారు. వాటి కోసం ప్రశ్నించిన విద్యార్థులపై అక్రమ కేసులు నమోదు చేయడం, లాఠీచార్జీలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మరోసారి ఉద్యమాలకు కేంద్రాలుగా మారే పరిస్థితి తీసుకురావద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర ఉపాధ్యక్షుడు విజయ్, సంయుక్త కార్యదర్శి దీపక్, సాయి కుమార్, కార్తిక్, మోహన్, శివ, ప్రభాస్ సాగర్, రవీందర్, శివకుమార్, శ్రవణ్, ప్రతాప్‌తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొని బంద్‌ను విజయవంతం చేశారు.



