ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు అండగా ఉంటా

ఎన్‌హెచ్‌ఎం సమ్మె శిబిరానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ సంఘీభావం

ఉద్యోగుల సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం, ఆరోగ్య మంత్రి దృష్టికి తీసుకెళ్తా

భోజన ఖర్చుల కోసం రూ.10 వేల ఆర్థిక సాయం


నాగర్‌కర్నూల్, అక్టోబరు 23 (మనఊరు ప్రతినిధి): ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారంతో 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్‌లోని సమ్మె శిబిరాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. సమ్మె శిబిరంలో సుమారు 300 మంది వరకు పాల్గొంటున్న ఆరోగ్య సిబ్బంది, వైద్యుల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల ఇబ్బందులను గుర్తించి, ఒకరోజు భోజన ఖర్చుల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ఎం పరిధిలో కాంటింజెంట్ వర్కర్ల నుంచి స్టాఫ్ నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది, వైద్యుల వరకు వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని తెలిపారు. సమ్మె కారణంగా ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నందున ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రితో ఫోన్‌లో మాట్లాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. అవసరమైతే సోమవారం మరోసారి మంత్రిని కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్ తదితరులు ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను ఎమ్మెల్యేకు వివరించారు. సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించడంతో పాటు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే వంశీకృష్ణకు జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని కొనసాగిస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.