నెమళ్ల వేటపై అనుమానాలు.. అసలు నిజమేంటి?

నెమళ్ల వేటపై అనుమానాలు.. అసలు నిజమేంటి?

కంపెనీ పరిసరాల్లో నెమలి ఈకలు, కాల్చిన అవశేషాలు ఉన్నాయంటూ రైతుల ఆరోపణలు

జడ్చర్ల, అక్టోబరు 18 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల నియోజకవర్గ పరిధిలో జాతీయ పక్షి నెమళ్ల మరణాలపై వివాదం నెలకొంది. మైత్రి లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ పరిసర ప్రాంతాల్లో నెమళ్లను వేటాడి చంపుతున్నారంటూ స్థానిక రైతులు చేస్తున్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. నవాబుపేట మండలం కారూరు, రాజాపూర్‌ మండలం చెన్నవెల్లి, జడ్చర్ల మండలం పోలేపల్లి శివారు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరుగుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. కంపెనీలో పనిచేస్తున్న వలస కార్మికులు ఉదయం వేళల్లో వలలు ఏర్పాటు చేసి నెమళ్లను పట్టుకుంటున్నారని, వాటిని బస్తాల్లో తరలించి పొదల్లో ఈకలు తొలగించి కాల్చుకుని తింటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నెమలి ఈకలు, కాల్చిన అవశేషాలు కనిపించినట్లు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

కుక్కలే వేటాడితే.. అవశేషాల సంగతేంటి?

నెమళ్ల వేట ఆరోపణలపై జడ్చర్ల ఫారెస్ట్‌ ఇన్‌స్పెక్టర్‌ను వివరణ కోరగా, తాను ప్రాథమిక విచారణ జరిపినట్లు తెలిపారు. తన విచారణలో కుక్కలు నెమళ్లను వేటాడి తిన్నట్లు తేలిందని వివరించారు. అయితే, ఘటనాస్థలంలో నెమలి ఈకలు, కాల్చిన అవశేషాలు ఉన్నాయంటున్న నేపథ్యంలో వాటి మూలాలను గుర్తించి, నెమళ్ల మరణాలకు అసలు కారణాలను నిర్ధారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డీఎఫ్‌వో విచారణతోనైనా నిజాలు తేలేనా?

ఈ వ్యవహారంపై జిల్లా అటవీ అధికారి నవీన్‌రెడ్డిని వివరణ కోరగా, సోమవారం విచారణకు పిలుస్తామని తెలిపినట్లు సమాచారం. నెమళ్లు జాతీయ పక్షులు కావడంతో వాటి సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలని స్థానికులు కోరుతున్నారు. ఆరోపణలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అందుబాటులో ఉన్న ఆధారాలను సేకరించి, బాధ్యులు ఎవరైనా ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. నెమళ్ల మరణాలకు అసలు కారణం ఏమిటి? ఈకలు, కాల్చిన అవశేషాలు ఎక్కడివి? రైతుల ఆరోపణల్లో వాస్తవమెంత? అటవీ శాఖ సమగ్ర విచారణతోనే ఈ ప్రశ్నలకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.