మరిచిపోయిన బ్యాగు, ఫోన్‌ను తిరిగి అప్పగించిన ఆటో డ్రైవర్

మరిచిపోయిన బ్యాగు, ఫోన్‌ను తిరిగి అప్పగించిన ఆటో డ్రైవర్

నిజాయితీ చాటుకున్న జగన్.. ఆటో యూనియన్ హాజీకి అభినందనలు

జడ్చర్ల, అక్టోబరు 23 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాల హెచ్ఎం లక్ష్మి ఆటోలో ప్రయాణిస్తూ మరిచిపోయిన బ్యాగు, సెల్‌ఫోన్, పర్సు, ముఖ్యమైన పత్రాలను గుర్తించి వాటిని శుక్రవారం సురక్షితంగా తిరిగి అప్పగించిన ఆటో డ్రైవర్ జగన్, ఆటో యూనియన్ హాజీ నిజాయితీని చాటుకున్నారు. జడ్చర్ల పట్టణానికి చెందిన వారు శుక్రవారం పాఠశాలకు ఆటోలో వెళ్లి, బాదేపల్లిలోని జెడ్‌పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాల వద్ద ఆమె ఆటో దిగారు. ఈ క్రమంలో తమ బ్యాగు, సెల్‌ఫోన్, పర్సు, సంబంధిత పత్రాలను ఆటోలోనే మరిచిపోయారు. విషయం గుర్తించిన అనంతరం ఆటో యూనియన్ హాజీని సంప్రదించి వివరాలు తెలిపారు. వెంటనే స్పందించిన హాజీ ఆటో డ్రైవర్‌ను గుర్తించి సంప్రదించారు. ఆటో డ్రైవర్ జగన్ ప్రయాణికులు మరిచిపోయిన బ్యాగు, సెల్‌ఫోన్, పర్సు, పత్రాలను భద్రంగా ఉంచి, హాజీ ద్వారా వాటిని తిరిగి హెచ్ఎం లక్ష్మికి  అందజేశారు. దీంతో తమ వస్తువులు తిరిగి లభించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల జీహెచ్‌ఎం లక్ష్మి, స్నేహలత, కృష్ణ తదితరుల సమక్షంలో వస్తువులను అందజేశారు. మరిచిపోయిన వస్తువులను తిరిగి అప్పగించి నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ జగన్‌తో పాటు వెంటనే స్పందించి సహకరించిన ఆటో యూనియన్ హాజీకి వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.