నంది వడ్డేమాన్‌లో ఘనంగా శని త్రయోదశి పూజలు
వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. శనేశ్వర స్వామికి తిలతైలాభిషేకాలు
బిజినేపల్లి, అక్టోబర్ 24 (మనఊరు ప్రతినిధి): మండలంలోని నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ సార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని శని గ్రహదోష నివారణ కోసం తిలతైలాభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ పూజల్లో అర్థాష్టమ, అష్టమ, ఏలినాటి శని దోష నివారణ కోసం భక్తులు స్వామివారిని ప్రత్యేకంగా కొలిచారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం నీటి వసతితో పాటు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు.
శని దోష నివారణకు స్వామి ఆరాధన
ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ జన్మరీత్యా, గోచారరీత్యా ఉన్న శని గ్రహదోషాల నివారణకు భక్తులు శక్తిమేరకు శనేశ్వర స్వామిని ఆరాధించాలని సూచించారు. ఈ మాసంలో స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని తెలిపారు. అదేవిధంగా ఆలయంలోని గోన బుద్ధారెడ్డి కాలం నాటి బ్రహ్మసూత్రం కలిగిన పరమశివునికి రుద్రాభిషేకం, అర్చనలు, దీపారాధనలు నిర్వహించగా, నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్‌రావు, గ్రామ సర్పంచ్ టి. సుగుణమ్మ, కమిటీ సభ్యులు కెంచె రాజేష్, ప్రభాకరచారి, పుల్లయ్య, అడ్వకేట్ వీరశేఖర్చారి, శ్రీకాంత్‌రెడ్డి, అర్చకులు శాంతికుమార్, ఉమామహేశ్వర్, సిబ్బంది గోపాల్‌రెడ్డి, శనేశ్వర స్వామి సేవకులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.










