పేద విద్యార్థుల భవిష్యత్తుకు గురువులే మార్గదర్శకులు

పేద విద్యార్థుల భవిష్యత్తుకు గురువులే మార్గదర్శకులు

ఎన్ఎంఎంఎస్ శిక్షణ శిబిరాలు విద్యార్థుల ఉన్నతికి దోహదం 

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

జడ్చర్ల, అక్టోబర్ 24 (మనఊరు ప్రతినిధి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులే మార్గదర్శకులని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ఉన్నత లక్ష్యాల వైపు నడిపించేది గురువులేనని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే నిజమైన ప్రజాసేవ అని పేర్కొన్నారు. మండలంలోని గొల్లపల్లిలోని శ్రీ లలితాంబికా తపోవనం వద్ద నిర్వహిస్తున్న పది రోజుల ఎన్ఎంఎంఎస్ ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న బోధన, సదుపాయాలను పరిశీలించి, వారితో మాట్లాడి శిక్షణ వివరాలను తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఇలాంటి శిక్షణ శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్‌ (ఎన్ఎంఎంఎస్) పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్లపాటు ఏటా రూ.12 వేల చొప్పున మొత్తం రూ.48 వేల వరకు ఉపకార వేతనం లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ అవకాశంపై అవగాహన కల్పించి, పరీక్షకు సిద్ధం చేయడం అభినందనీయమన్నారు. గతంలో నిర్వహించిన శిక్షణ ద్వారా ప్రయోజనం పొందిన ఓ విద్యార్థిని ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి ఉన్నత విద్యను అభ్యసిస్తోందని ఆమె తల్లిదండ్రులు తనను కలిసి సంతోషం వ్యక్తం చేసిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తుచేశారు. సరైన శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే పేద కుటుంబాల విద్యార్థులు సైతం ఉన్నత విజయాలు సాధించగలరని అన్నారు.

ఉపాధ్యాయుల అంకితభావం అభినందనీయం

పాఠశాల విధులు నిర్వహిస్తూనే తెల్లవారుజామున, సాయంత్రం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల అంకితభావాన్ని యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ప్రశంసించారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. మహాత్మా గాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని వెనుకబడిన వర్గాల విద్యార్థుల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు విమర్శలు, ప్రతి విమర్శలకు పరిమితం కాకుండా ప్రజలకు, విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి సేవ చేస్తున్నామన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు. జడ్చర్ల నియోజకవర్గంలో శిక్షణ శిబిరం నిర్వహణకు సహకరించిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిర్వహించే ఇలాంటి విద్యా కార్యక్రమాలకు తన సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ లలితాంబికా తపోవనం ఆలయ చైర్మన్‌ జి.భాస్కర్‌, మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ పర్యవేక్షకులు గుండా మనోహర్‌, వందేమాతరం ఫౌండేషన్‌ సమన్వయకర్త రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.