అలై బలైతో స్నేహభావం, సోదరభావం పెంపొందుతుంది
జడ్చర్లలో ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా అలై బలై
జడ్చర్ల, అక్టోబర్ 23 (మనఊరు ప్రతినిధి): అలై బలై వంటి ఆత్మీయ కార్యక్రమాలు ప్రజల మధ్య స్నేహభావం, సోదరభావం, ఐక్యతను పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని ఆత్మీయ మిత్రమండలి అధ్యక్షులు బాదిమి శివకుమార్ అన్నారు. పట్టణంలోని చందర్ గార్డెన్స్‌లో శుక్రవారం ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో అలై బలై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిత్రమండలి సభ్యులు, మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ అలై బలై కార్యక్రమం కుల, మత, రాజకీయ భేదాలకు అతీతంగా ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పరస్పర స్నేహాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్మాస్టర్ శంకర్‌రెడ్డి, అలంపల్లి మనోహర్, డాక్టర్ రాంరెడ్డి, నర్సింలు, విశ్వనాథం, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
