మున్సిపాలిటీలకు కొత్తగా 453 మంది ఇంజనీరింగ్ అధికారులు
• బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పోస్టులు మంజూరు చేయలేదు
• ఇంచార్జ్ అధికారులతోనే ప్రస్తుతం పనులు చేయిస్తున్నాం
• ఎఇ, డిఇ, ఇఇ, ఎస్ఇ స్థాయి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం
• అనిరుధ్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానం
• వెల్లడించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
జడ్చర్ల రూరల్,మే 8(మన ఊరు న్యూస్): తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలలో ప్రస్తుతం కొత్తగా 453 ఇంజనీరింగ్ అధికారుల నియామకానికి చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు తాను అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రం ఏర్పడక ముందు అంటే ఉమ్మడి రాష్ట్రంలో 62 మున్సిపాలిటీలో ఉంటే గత పదేళ్ల కాలంలో వాటి సంఖ్య 152 కు పెరిగిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీలనైతే ఏర్పాటు చేసింది గానీ వాటిలో పని చేయడానికి అవసరమైన కమీషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారుల పోస్టులను మాత్రం మంజూరు చేయలేదని గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అనిరుధ్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కూడా ఏర్పాటు చేసిన 42 కొత్త మున్సిపాలిటీలు కమీషనర్లు, ఏఇఇలు, టీపీఓలు లేకుండానే పని చేసాయని చెప్పారు. అయితే అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి కమీషనర్లు, మున్సిపాలిటీలకు మంజూరయ్యే అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి ఇంజనీరింగ్ అధికారులు, పట్టణాల ప్రగతికి అవసరమైన అనుమతులు ఇచ్చే టౌన్ ప్లానింగ్ అధికారులు లేకపోతే మున్సిపాలిటీలు ఎలా అభివృద్ధి చెందుతాయని ఆయన ప్రశ్నించారు. ఈ కారణంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కూడా ఈ కొత్త మున్సిపాలిటీలలో ఇంచార్జీల పాలనతో ఏ మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందని పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది అక్టోబర్ నెలలో ఈ మున్సిపాలిటీలకు అవసరమైన కమీషనర్ పోస్టులను మంజూరు చేసి వాటికి సంబంధించిన నియామకపు ప్రక్రియ చేపట్టిందని,కమీషనర్లతో పాటుగా టౌన్ ప్లానింగ్ అధికారుల అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం 165 మంది టౌన్ ప్లానింగ్ అధికారులను నియమించడం జరిగిందని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులు చేపట్టడానికి అవసరమైన ఎఇఇ, డిఇఇ లాంటి ఇంజనీరింగ్ అధికారుల పోస్టులను కూడా మంజూరు చేయలేదని అనిరుధ్ రెడ్డి వివరించారు. 2009 లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పుడున్న 62 మున్సిపాలిటీల సంఖ్యకు అనుగుణంగా మంజూరు చేసిన ఇంజనీరింగ్ పోస్టులతోనే ఇప్పటి వరకూ నెట్టుకొస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగిన పదేళ్ల కాలంలో ఇంజనీరింగ్ పోస్టులను మంజూరు చేయలేదని చెప్పారు. ఉదాహరణకు చెప్పాలంటే లక్ష మంది జనాభా కలిగిన జడ్చర్ల మున్సిపాలిటీలో పాత నిబంధనల ప్రకారంగా అయితే ఒక డిఇ, ఇద్దరు ఏఇఇలు ఉండాలని, కొత్త రూల్స్ ప్రకారంగా అయితే ఒక ఇఇ కూడా ఉండాలని, కానీ ఈరోజు వరకూ కూడా జడ్చర్ల మున్సిపాలిటీలో ఒక్క రెగ్యులర్ ఏఇఇ కూడా లేరని తెలిపారు. ఏఇఇలు, డిఇఇ లు లేకుండా అభివృద్ధి పనులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. ప్రస్తుతం ఒక్కో ఏఇఇ 6 మున్సిపాలిటీలకు ఇంచార్జీలుగా పని చేస్తున్నారని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 21 మున్సిపాలిటీలు ఉంటే ఆ 21 మున్సిపాలిటీలకు కలిపి ఇద్దరు డిఇఇ లే ఉన్నారని, అలాగే 21 మున్సిపాలిటీలకు కలిపి కేవలం ఒకే ఒక్క ఇఇ ఉన్నారని వెల్లడించారు. ఒక ఇఇ 21 మున్సిపాలిటీల్లో జరిగే పనులను పర్యవేక్షించడం సాధ్యమౌతుందా? అని వాపోయారు. అలాగే ఇక రాష్ట్రం విషయానికొస్తే 5 ఉమ్మడి జిల్లాలకు కలిపి ఒక ఎస్ఇ ఉన్నారని, ప్రస్తుతం సౌత్ కు ఒకరు, నార్త్ కు ఒకరు చొప్పున రాష్ట్రంలో కేవలం 2 ఎస్ఇ లు మాత్రమే పబ్లిక్ హెల్త్ లో పని చేస్తున్నారని వివరించారు. ఇక ఎస్ఇ తర్వాత సిఇ పోస్టులు మంజూరు కాలేదని, ఒక ఇ.ఎన్.సీ. మాత్రం ఇంచార్జ్ గా పని చేస్తున్నారని అనిరుధ్ రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలోనే తాను అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ, కొత్తగా ఏర్పాటు చేసిన పురపాలికల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంజనీరింగ్ పోస్టులను మంజూరు చేయని మాట వాస్తవమేనని చెప్పిందన్నారు. అలాగే ఏఇఇ, డిఇఇ, ఇఇ, ఎస్ఇ స్థాయిల్లో 453 ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించిందని అనిరుధ్ రెడ్డి వివరించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి మున్సిపాలిటీల అభివృద్ధికి దోహదపడాలని ప్రభుత్వాన్ని కోరారు.