తల్లిదండ్రులకు పాద పూజ చేసిన పిల్లలు..
అమ్మానాన్నల సేవని త్యాగాన్ని గుర్తించమంటున్న
ఐక్యత ఫౌండేషన్
కల్వకుర్తి, మే 7 (మనఊరు ప్రతినిధి): కనిపించని ఆ దైవం కంటే.. కని పెంచే తల్లిదండ్రులు మిన్న..అమ్మానాన్నలు దేవుళ్లతో సమాన మని ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు సుంకిరెడ్డి సుభాషిణి కృష్ణారెడ్డి అన్నారు. పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ హైస్కూల్ లో గత 20 రోజులుగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో వందేమాతరం ఫౌండేషన్, శృతిలయ కల్చరర్ అకాడమి వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరంలో బాగంగా బుధవారం నిర్వహించిన తల్లిదండ్రుల పాద పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఐక్యత ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు సుంకిరెడ్డి సుభాషిణి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జన్మనిచ్చి ఇంతటి వారిని చేసిన తల్లిదండ్రులకు ఏమిచ్చిన రుణం తీర్చుకోగలం అని అన్నారు. ప్రత్యక్షదైవాలైన వారిని వదిలేసి కనిపించని దేవుడి కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతామన్నారు. తల్లిదండ్రులను పూజించకపోయినా పర్వాలేదు గానీ వారి ఆదరించాలని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అరుదైన గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించాలని చేపట్టడం అభినందనీయం న్నారు. సమస్త భూమికంటే బరువైనది తల్లి…. ఆకాశం కన్నా ఉన్నతుడు తండ్రి. ఒక్కసారి తల్లిదండ్రులకు నమస్కరిస్తే గోవును దానం చేసిన ఫలం దక్కుతుందన్నారు. సత్యం తల్లి… జ్ఞానం తండ్రి. పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడని తెలిపారు. వందమంది ఆచార్యులకంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రికంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి అని వివరించారు. వారికి సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ, వెయ్యిసార్లు కాశీయాత్ర, వందసార్లు సముద్ర స్నానం చేసిన ఫలమూ దక్కుతాయన్నారు. ఈ విషయానికి భావితరాలకు గుర్తు పెట్టుకునే విధంగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ ఎడ్మ మాధవరెడ్డి, శృతిలయ కల్చరర్ అకాడమి చైర్మన్ చిత్తరంజన్ దాస్, మై విలేజ్ మోడల్ విలేజ్ ఫౌండేషన్ చింతల నితిన్ గౌడ్, ఆచార్య రమేష్ గురూజీ, శిశుమందిర్ ఉపాధ్యాయులు రాజు, మహేశ్వరం హెచ్ఎం శంకరయ్య, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు శేఖర్, శ్రీపతి, రవియాదవ్, అభినవ్ రెడ్డి, శ్రీనులతో పాటు తదితరులు పాల్గొన్నారు.