ప్రజల ఆరోగ్యానికి ప్రధాన శత్రువులు దోమలు*
*డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వి. విజయలక్ష్మి*
*లట్టుపల్లిలో ఘనంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం*
*ర్యాలీని ప్రారంభించిన డాక్టర్ టి. ప్రసన్న
బిజినపల్లి, మే 16 (మనఊరు ప్రతినిధి): ప్రజల ఆరోగ్యానికి ప్రధాన శత్రువులు దోమలని అవి పుడితే ఎంతటి వారైనా అనేక వ్యాధులకు గురికాక తప్పదని అందుకే దోమలు కుట్టకుండా, పుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ టి. ప్రసన్న పిలుపునిచ్చారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవ సందర్భంగా మండల పరిధిలోని లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దొమ కాటు వ్యాధులపై అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ టి. ప్రసన్న మాట్లాడుతూ.. దోమలు పుట్టకుండా చూద్దాం - దోమలు కుట్టకుండా అనే నినాదాన్ని తీసుకువచ్చారు. దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులని, దోమల ద్వారా డెంగ్యూ మలేరియా ఫైలేరియా చికెన్ గనియా మెదడువాపు వ్యాధులు వస్తాయని తెలియజేశారు. మన ఇల్లు, పరిసర ప్రాంతాలలో నిల్వ ఉన్న నీటిలో అనా పిలస్ దోమ, క్యూలెక్స్ దోమ, ఏడిస్ దోమ, అజ్మీరస్ దోమలు పెరుగుతాయి అని వివరించారు. డెంగ్యూ వ్యాధి ఎడిస్ దోమ కుట్టడం వల్ల వస్తుందని తెలియజేశారు. డెంగ్యూ వ్యాధి చికెన్ గన్యాకంటే శరీరంలోనీ ఎక్కువ శక్తిని హరింప చేస్తుందని తెలిపారు. డెంగ్యూ వ్యాధి సరైన సమయంలో చికిత్స చేయించుకోనట్లయితే మనిషి చనిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. వ్యాధి వచ్చిన 50 మందిలో ఒకరు చనిపోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. దోమలు ఇండ్ల పరిసరాలలో నిల్వ ఉండే నీళ్లలో పెరుగుతాయని, ఈ దోమలు పగటిపూట కుడుతాయని డాక్టర్ టి. ప్రసన్న తెలియజేశారు. ఆశా కార్యకర్తలు,ఆరోగ్య సిబ్బంది గ్రామాలలో,గిరిజన తండాల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ తేజస్విని, డాక్టర్ మేఘనారెడ్డి, సూపర్వైజర్ బాలమణి, ఆరోగ్య కార్యకర్తలు అబ్దుల్ సలీం, విజయలక్ష్మి, వరలక్ష్మి ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.