చేగుంటలో గుంటనక్క దాడితో రెండు గేదె దూడలు మృతి
ఫారెస్ట్ రేంజ్ అధికారి దేవరాజ్
నాగర్‌కర్నూలు, మే 5 (మనఊరు ప్రతినిధి): జిల్లాలోని తిమ్మాజిపేట మండలంలోని చేగుంట గ్రామ శివారులో గుంటనక్క దాడితో రెండు గేదె దూడలు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వినోద్ అనే రైతు తన పొలంలో పశువులను కట్టి ఉంచగా, అటవీ ప్రదేశం నుంచి వచ్చిన గుంటనక్క వీటిపై దాడి చేసి చంపివేసింది. ఉదయం రైతు వెళ్లి చూడగా ఇట్టి విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ఈ విషయం పై స్పందించిన నాగర్‌కర్నూల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి దేవరాజ్ మాట్లాడుతూ రైతులు రాత్రి సమయంలో దూడలను, మేకలను, గొర్రెలను పొలాల్లో కాకుండా ఇంటి వద్ద మాత్రమే కట్టి ఉంచాలన్నారు. పొలాల్లో మేకలను గొర్లను గేదె దూడలను కట్టి ఉంచడం వల్ల ఇలా దాడులు జరిగే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ఈ ఘటనపై స్పందించిన దేవరాజ్, నష్టపోయిన రైతుకు అటవీశాఖ నిబంధనల ప్రకారం ఆర్థిక పరిహారం అందించే ప్రయత్నం చేస్తామన్నారు. సంఘటన స్థలాన్ని ఆయనతో పాటు బయాలజిస్ట్ రవికాంత్ కలిసి పరిశీలించారు.