పురిటి నొప్పులతో విలవిలలాడుతున్న పుడమి

 పురిటి నొప్పులతో విలవిలలాడుతున్న పుడమి

సమృద్ధిగానీరు అందక ఊపిరి పోసుకోవడానికి అపసోపాలు పడుతున్న విత్తనాలు 

పురుడు పోసుకున్న మొలకలను కాపాడుకోవడానికి 

 అష్ట కష్టాలు పడుతున్న అన్నదాతలు




జడ్చర్ల రూరల్, జూన్ 9 (మనఊరు ప్రతినిధి): పురిటి నొప్పులతో పుడమి విలవిలలాడుతున్నది. కన్నెగా ఉన్న పుడమిని వర్ష ఋతువు ప్రారంభానికి ముందే వరుణుడు కన్నుగీటి వలపు వల విసిరి ఆ వలపు వలలో చిక్కి పంటి బిగువున నాగళ్ల దున్నుడును తట్టుకుని గర్భం దాల్చిన పుడమి పురుడు పోసుకోవడానికి అవసరమైన సమయంలో వరుణుడు

 ముఖంచాటేసి కలిసి రాకపోవడంతో పురుడు పోసుకోవడానికి విలవిలలాడుతున్నది. నైరుతి రుతుపవనాల ఆగమనం కారణంగా ఈ వర్షాకాలం సీజన్ లో తొలకరి జల్లుల రూపంలో వర్షం సమృద్ధిగా కురిసింది. దాంతో భూమిలో విత్తనాలు విత్తడానికి అదునుకు తగ్గ పదును లభించడంతో రైతులు ఆనంద పడిపోయి తమ దుక్కులను ఆదరాబాదరాగా దున్నుకుని పంట పొలాల్లో విత్తనాలు విత్తుకున్నారు. అంతవరకు రైతులకు వెన్నుదన్నుగా ఉన్న వరుణుడు విత్తనాలు మొలకెత్తే సమయంలో చాటేయడంతో రైతులు విత్తనాలను మొలకెత్తించుకోవడానికి అనేక వ్యయ ప్రయాసలు పడుతున్నారు. ముఖ్యంగా ఈ వర్షాకాలం సీజన్ లో కురిసే వర్షాలను నమ్ముకుని పత్తి పంటను సాగుచేసిన రైతులు పత్తి విత్తనాలను మొలిపించుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ వర్షాకాలం సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో పంటల సాగుకు పూనుకున్న అన్నదాతలు వరుణు డు అవసరమైన సమయంలో ముఖం చాటేయడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. వరుణుడు ప్రతిరోజు మురిపించి వలపించి ముఖం చాటేస్తుండటంతో రైతులు ఆకాశం వంక ఆశగా ఎదురుచూస్తూ వర్షం కురియకపోతుండడంతో నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికైనా వరుణుడు కరుణించి వర్షం సమృద్ధిగా కురిపించి పుడమి తల్లిని పురిటి నొప్పుల బారినుండి బయటపడేలా చేసి తమకు జీవనాధారం కల్పించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

Previous Post Next Post