*బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం*
ఎనిమిది మంది మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
అనకాపల్లి, ఏప్రిల్ 13 (మనఊరు ప్రతినిధి): అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందితోపాటు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదు పులోకి తీసుకొచ్చారు .
పోలీసులు క్షతగాత్రులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ప్రమాద ఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ సందర్శించారు. క్షతగాత్రుల కుటుంబాలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అలాగే సహాయక చర్యలను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఆ క్రమంలో పీహెచ్‌సీలో చికిత్స పొందుతోన్న క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హోం మంత్రి అనితతోపాటు జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఆయన ఫోన్లో మాట్లాడి ఈ ఘటనపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వారిని ఆదేశించారు.
ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని సీఎం చంద్రబాబుకు హోం మంత్రి అనిత వివరించారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు.ఇంకోవైపు.. విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.
ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో హోం మంత్రి అనిత.. హుటాహుటన ఘటన స్థలానికి చేరుకు న్నారు. క్షతగాత్రులకు సహాయక చర్యలను పర్యవేక్షించారు. అలాగే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సైతం ఈ దుర్ఘటనపై స్పందించారు.