*గర్భిణీలకు సకాలంలో మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలి*
బిజినపల్లి, ఏప్రిల్ 19 (మనఊరు ప్రతినిధి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతి గర్భిణీ యొక్క నమోదు మాత శిశు ఆరోగ్యం పోర్టల్ లో 12 వారాల లోపు తప్పనిసరిగా అంతర్జాలంలో నమోదు చేయాలని మాతా శిశు సంరక్షణ జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ఎం లక్ష్మణ్ నాయక్ అన్నారు. శనివారం నాడు బిజినపల్లి మండల పరిధిలోని పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికతనిఖీ నిర్వహించారు. ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం పొందే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. గర్భిణీలకు అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించి మూత్ర రక్త పరీక్షలు తెలంగాణ డయాగ్నస్టిక్ ల్యాబ్ లో ఉచితంగా నిర్వహించి రిపోర్టులు అందజేయాలని సూచించారు. రక్తహీనత పౌష్టికాహారం పై ప్రత్యేక శ్రద్ధ ప్రతి ఆరోగ్య కార్యకర్త ఆశా కార్యకర్త ప్రతి గర్భిణీకి వ్యక్తిగతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. రికార్డు నమోదు చేయుటలో ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని సిబ్బందికి సూచించారు. జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులు నర్సింగ్ సిబ్బంది ప్రతి గర్భిణికి సాధారణ ప్రసవం అయ్యే విధంగా ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకున్నదని, గతంలో సిజేరియన్ అయిన వారికి ఉచితంగా సిజేరియన్ ప్రసవాలు గర్భిణీలకు చేస్తున్నట్లు తెలిపారు.జిల్లా ఆస్పత్రిలో స్త్రీ వైద్య నిపుణులు, చిన్నపిల్లల వైద్యనిపుణులు 24 గంటలు అందుబాటులో ఉన్నారని, ప్రతి గర్భిణికి ఉన్నతమైన మెరుగైన ఆరోగ్య సేవలు పొందుటకు జిల్లా ఆసుపత్రికి 102 అంబులెన్స్ ద్వారా వారిని పరీక్షలకు పంపించాలని సూచించారు.ప్రసవం అనంతరం శిశువులకు చూయించుకొనుటకు చిన్నపిల్లల వైద్యులు కూడా అందుబాటులో ఇలా ఆస్పత్రిలో ఉన్నారని అన్నారు. మెరుగైన ఆరోగ్య సేవలు ప్రతి గర్భిణికి అందే విధంగా తప్పనిసరిగా ప్రణాళిక సిద్ధం చేయాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాలెం వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక, విస్తీర్ణ అధికారి బాదం రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.