కన్న తండ్రి పట్ల కాలయముడైన తనయుడు
నవాబుపేట, మే 12 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రానికి చెందిన ఎరుకలి బుచ్చయ్య (52) అనే వ్యక్తిని ఆయన కుమారుడు ఎరుకలి యాదయ్య సోమవారం సాయంత్రం తల్లి ఎరుకలి మాసమ్మ కళ్ళముందే గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కొంతకాలం క్రితం యాదయ్య మహబూబ్ నగర్ పట్టణంలోని పాల్ కొండకు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొడుకు ప్రేమ వివాహం చేసుకోవడం నచ్చని బుచ్చయ్య కోడలిని సూటి పోటి మాటలతో తరచూ అసహ్యించు కుంటుండేవాడు. అదే రీతిలో సోమవారం కోడలిని అసహ్యించుకోవడం తో పాటు ఆమెపై బుచ్చయ్య చేయి చేసుకున్నాడు. అది చూసి భరించలేని యాదయ్య క్షణికావేశానికి గురై పక్కనే ఉన్న గొడ్డలిని తీసుకొని తండ్రి తలపై, మెడ పై విచక్షణారహితంగా నరికాడు. దీంతో బుచ్చయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్సై విక్రం పోలీసులను అక్కడికి పంపి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా ఈ విషయ పై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అందువల్ల కేసు నమోదు చేయలేదని ఎస్సై ఎమ్.విక్రం తెలిపారు.