అమరవీరుడికి అశ్రునివాళి
మీర్పేట్, మే 12 (మనఊరు ప్రతినిధి): పాక్ భారత్ సరిహద్దుల్లో జరుగుతున్న సింధూర్ యుద్ధంలో వీరమరణం పొందిన ఎం మురళి నాయక్ కు మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలోని 97 డివిజన్ లో గ్రీన్ రిచ్ కాలనీ నుంచి మీర్పేట్ చౌరస్తా వరకు అమరవీరుడికి అశ్రునివాళి పేరుతో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈసందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చెరిగింత పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ యుద్ధభూమిలో పోరాడుతూ వీరమరణం పొందిన మురళి వాయక్ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉండి, యువతకు స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటాడని మురళి నాయక్ ప్రాణత్యాగాన్ని ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు అన్నారు. పాక్ దుష్ట మూకలతో వీరోచితంగా పోరాడుతున్న భారత సైన్యంలో ఆత్మస్థైర్యం నింపడానికి యావత్ దేశప్రజలు ఏకమై సైన్యానికి అండగా నిలవాలని కోరారు. భారతదేశం ఎప్పటికీ ప్రపంచశాంతినే కోరుకుంటుందని, కానీ దేశ సరిహద్దులు దాటి అమాయక ప్రజలప్రాణాలను బలితీసుకుంటున్నతీవ్రవాదులకు గట్టిగా బుద్ధి చెబుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదులను మట్టుపెట్టి, ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి ప్రపంచ దేశాలన్ని ఏకం కావాలని అన్నారు. దేశం కోసం పోరాడుతూ యుద్ధభూమిలోనే అమరవీరులైన మురళి నాయక్ లాంటి సైనికుల ప్రాణాలకు విలువ కట్టలేమని, వారి కుటుంబాలకు ఎంత చేసినా అది తక్కువేనని అన్నారు. భవిష్యత్తు తరం సైనిక రంగాన్ని ఎంచుకోవడానికి, వారికుటుంబాలకు భరోసానివ్వడానికి కేంద్ర ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా నిలవాలని అన్నారు. ఈ సందర్భంగా అమరులైన వీర సైనికులకు మౌనం పాటించి, వారి ఆత్మకు శాంతి చేకురాలని నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పెద్ద బావి సురేందర్ రెడ్డి, నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.