*కాలినడక భక్తుల కోసం ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు!*
*త్వరలో పాలక మండలి నిర్ణయం*
*తితిదే ఎలక్ట్రిక్ ఉచిత ధర్మరథం బస్సు*
తిరుమల, మే 5 (మనఊరు ప్రతినిధి): శ్రీవారి దర్శనార్థం తిరుపతి నుంచి కాలినడకన తిరుమల వచ్చే సామాన్య భక్తుల కోసం 20 ఎలక్ట్రిక్ బస్సులను తితిదే ఉచితంగా నడపనుంది. ఈ వాహనాల్లో తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు యాత్రికులను తీసుకెళ్లాలని ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే తితిదే ఆధ్వర్యంలో ఉచిత ధర్మరథం బస్సులను ఏర్పాటు చేసినా భక్తుల రద్దీకి అనుగుణంగా లేవు. ఇదే అదనుగా జీపు, ట్యాక్సీ, ఆటోడ్రైవర్లు భక్తులను అడ్డంగా దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించే తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో దాతల సహకారంతో బస్సులను కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకుంటారని సమాచారం.*