*గ్రామీణ కళలకు ప్రాణం పోసిన వాయిస్ ఆఫ్ జర్నీ..*
*పేరు మోసిన గాయకులతో పాటు, గ్రామీణ కళాకారులకు అవకాశం..*
*పాటల పల్లకిలో మురిసి.. సంగీత జడిలో తడిసి..*
*పాటలతో తడిసి ముద్దయిన పిల్లలు, పెద్దలు*
*వర్తమాన గాయకులకు చక్కని వేడుక..*
*ఎలివేట్స్ ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ వేడుక..*
*అద్భుత కార్యక్రమానికి రాజధాని వేదిక*
*షాద్ నగర్ టూ హైదరాబాద్*
*ముఖ్య అతిథులుగా హాజరైన సినీ నటుడు టార్జాన్, సెన్సార్ బోర్డు సభ్యులు చెంది మహేందర్ రెడ్డి*
పాటల పల్లకిలో ఊరేగే చిరుగాలిలో.. పాడుతా.. తీయగా.. చల్లగా.. అంటూ నా పాట పంచామృతం అని తన శక్తిని తాను నమ్ముకుంటూ.. కోకిలమ్మ కొత్త పాట పాడినట్లు.. రాగమయి రావే.. అనురాగమయి రావే.. అని తమ ప్రతిభను ఆహ్వానించుకుంటూ.. చక్కనైన గీతాలను ప్రాణం పోశారు.. స్వచ్ఛమైన సంగీతాన్ని చెవులారా ఆస్వాదించేలా తమ సత్తా చాటారు. ఎలివేట్స్ ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ వారి ఆధ్వర్యంలో వాయిస్ ఆఫ్ జర్నీ షాద్ నగర్ టు హైదరాబాద్ పేరిట జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. గ్రామీణ కళాకారులకు, వారిలోని అద్భుతమైన ప్రతిభకు ప్రాణం పోసింది. కళలకు మరణం లేదు.. కళాకారులకు విరామం లేదు.. అని నిరూపించిన అచ్చమైన, అత్యంత స్వచ్ఛమైన ఈ కార్యక్రమానికి తెరతీస్తే..
*సంగీత సామ్రాజ్యం..*
నిజమే.. వాయిస్ ఆఫ్ జర్నీ షాద్ నగర్ టు హైదరాబాద్ పేరిట వర్తమాన గాయని గాయకులను ప్రోత్సహించే ఉద్దేశంతో హైదరాబాద్ కు చెందిన ఎమ్ఎస్ఎన్ రావు, బాంధవీ దంపతులు, స్థానిక కళాకారుడు, అధ్యాపకుడు హరీష్ శర్మల ఆధ్వర్యంలో రాజధాని వేదికగా హయత్ నగర్ లోని ట్రిపుల్ ఏ ఆడిటోరియంలో ఓ సంగీత సామ్రాజ్యాన్నే సృష్టించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన 30 మంది సంగీత కళాకారులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. తమ ప్రతిభతో పేరుగాంచిన కళాకారులతో పాటు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వర్తమాన కళాకారులకు అవకాశం కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని సర్వాంగ సుందరంగా రూపొందించారు. అద్భుతమైన సంగీత సాంకేతికత ఉన్న ఈ ఆడిటోరియంలో అసమాన ప్రతిభ కలిగిన గాయని గాయకులు తమ ప్రతిభను చాటారు. ఆణిముత్యాలు వంటి పాటలను చూసేవారికి అందించారు. అసమాన ప్రతిభ కలిగిన గాయని గాయకులు పాడిన పాటలు గ్రామీణ కళాకారులకు స్ఫూర్తిగా నిలిచాయి.
*సంగీత సంగ్రామం..*
నిజమే చక్కనైన సంగీతం వినిపించే కళాకారుల మధ్య ఒక ఆరోగ్యకరమైన సంగీత సంగ్రామమే ఇక్కడ జరిగిందని చెప్పాలి. ముఖ్యంగా పోలీసు శాఖకు చెందిన గంగాధర్, అపర్ణ పాడిన చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు.. ఏకమైన హృదయాలలో విరిసే బంగరు రంగులు.. అంటూ శ్రావ్యమైన సంగీతాన్ని చెవులకు అందించారు. దేవులపల్లి వారి అక్షర అల్లికను మరోసారి కళ్ళకు కట్టారు. ఇక ఇక వరుణ్ మానస కలయికలు స్వర్ణకమలం చిత్రం నుండి పాడిన పాట సభను ఆద్యంతం ఆకట్టుకుంది. జర్నలిస్టు కేపీ నువ్వు మల్లెతీగ నేను తేనెటీగ.. కాశీ విశ్వనాథ.. తండ్రి విశ్వనాథ.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. లాంటి పాటలతో ఆకట్టుకోగా, విజయవాడకు చెందిన కళాకారురాలు రోజా ప్రసన్నలత ఈల పాటలతో కార్యక్రమాన్ని మరో కోణంలో రక్తి కట్టించారు. ఇక చిన్నారులు బ్రాహ్మణి, వరలక్ష్మి పాడిన లవకుశల పాట ఎంతగానో ఆకట్టుకుంది. మధులిక, జగదీశ్వర్ రెడ్డిల ఓ బంగారు రంగుల చిలక పాట ఆకట్టుకుంది.
సురేందర్ పాడిన అబ్బనీ తీయని దెబ్బ, శ్రీరాణి పాడిన పరిమలించు పున్నమిలో, డివివిఎస్ నారాయణ, ఆర్.సి పాడిన తెలుగు హిందీ, కన్నడ బహుభాషా పాటలు ఎంతగానో పులకరించాయి. హరీష్ శర్మ పాడిన తనివి తీరలేదే పాట ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ప్రాణం పోసిన ఎమ్మెస్ ఎన్ రావు, భార్గవి జంట సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలోని సంక్రాంతి పాటతో ఈలలు, స్టెప్పులు వేయించారు. వీరే కాకుండా వరుణ్, కన్నా, ప్రేమ రాజ్, సురేందర్, వేణుగోపాల్, జగదీశ్వర్ రెడ్డి, యోగానంద తదితరులు ఆలపించిన గీతాలు హృదయాలను దోచుకున్నాయి. వరుణ్ పాడిన మీరే రంగుమే రంగునేవాలీ పాట సభలో చప్పట్లు కొట్టించింది. కవులు రాసిన అందమైన అక్షరానికి, సినీ సంగీత కళాకారులు తమ సంగీతంతో ప్రాణం పోస్తే, గాయకులు వాటిని సజీవంగా జన హృదయాల్లో నిలిపారు. అలాంటి అద్భుతమైన గీతాలను మరోసారి జన హృదయాల్లో జొప్పించి, అలనాటి అసమాన గాయకుల స్థాయిలో మెప్పించిన ఈ కార్యక్రమం అపూర్వం.. అభినందనీయం.
*కళలకు వెలిగే లక్ష్యం..*
కళలకు చక్కని వెలుగును తీసుకురావాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి తమ ప్రతిభను చాటిన కళాకారులకు కృతజ్ఞతలు.
*ఎమ్మెస్ ఎన్ రావ్, బాంధవి దంపతులు*
*పాట వెలగాలి..*
ప్రపంచంలో ఉన్న విభిన్నమైన కళలలో పాట ప్రముఖమైనది. కవులు, సంగీత కళాకారులు, గాయకుల కృషితోనే ఇది వెలుగులోకి వస్తుంది. అలాంటి పాట గొప్పతనం ప్రపంచానికి తెలియాలన్నదే లక్ష్యం.
*హరీష్ శర్మ*
*అద్యంతం జనరంజకం..*
ఇలాంటి కార్యక్రమాలు ఆద్యంతం జనరంజకంగా ఉంటాయి. చూపరులను చక్కగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ కూడా ఏమాత్రం తగ్గకుండా వర్తమాన కళాకారులు తమ సత్తా చాటడం అభినందనీయం.
*టార్జాన్, సినీ నటుడు*
*చాలా సంతోషం..*
మన భారతీయ కళలు ఎంతో గొప్పవి. ఆయా రంగాల్లో నిపుణులైన కళాకారులు ఇలాంటి కార్యక్రమాల ద్వారా తరచూ తమ సత్తా చాటుతూనే ఉన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కళాకారులకు అభినందనలు.
*చెంది మహేందర్ రెడ్డి, సెన్సార్ బోర్డు సభ్యులు, సీనియర్ న్యాయవాది*
*కళలు ప్రాణం.. అందుకే సహకారం..*
చిన్నతనం నుంచి కలలు అంటే నాకు ఎంతో మక్కువ. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ ఉన్న నా వంతు సహకారాన్ని అందించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఈ కార్యక్రమంలో నేను కూడా భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో అద్భుతమైన గీతాలను పాడిన వర్తమాన కళాకారులు మంచి భవిష్యత్తును అందుకోవాలని ఆశిస్తున్నాను.