*వికలాంగుల అభివృద్ధికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి.*
*న్యాయం కోసం... మే 13న డైరెక్టర్ కార్యాలయం ముట్టడి*
*ప్రభుత్వ ఉద్యోగాల్లో రోస్టర్ 10లోపు మార్చాలి*
*ఎన్పిఆర్డి రంగారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగ రెడ్డి*
రంగారెడ్డి, మే 4 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది వికలాంగులు న్యాయహక్కుల కోసం పోరాడుతున్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) రాష్ట్రస్థాయి పిలుపు మేరకు మే 13న వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం ముట్టడి చేపట్టనున్నట్లు రంగారెడ్డి జిల్లా వికలాంగుల జాతీయ వేదిక అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ...వికలాంగులకు సామాజిక భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ 10లోపే ఉండేలా మార్చాలని, వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక కమిషన్, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.తెలంగాణలో 43.02 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 10.48 లక్షల మంది వికలాంగులుండగా, కేవలం 4,90,044 మందికే పెన్షన్లు లభిస్తున్నాయి. RPWD చట్టం (2016), మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ (2017) అమలులో విఫలమవుతున్నట్టు వేదిక పేర్కొంది.వికలాంగులపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు పెరుగుతున్నాయని, మహిళా వికలాంగుల రక్షణపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. విద్యా రంగంలో స్పెషల్ విద్యా సంస్థలు లేకపోవడం వల్ల చాలా మంది వికలాంగ విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు.ప్రభుత్వ శాఖల్లో ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలవ్వడం లేదని, వికలాంగుల వివాహ ప్రోత్సాహకాన్ని రూ.2 లక్షలకు పెంచాలని, ఇద్దరు వికలాంగులు పెళ్లి చేసుకుంటే రూ.5 లక్షల ప్రోత్సాహకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మోటారైజ్డ్ వాహనాలు, పరికరాల పంపిణీ, RTCలో ఉచిత ప్రయాణం వంటి మౌలిక సదుపాయాలు అందించాలని కోరారు.ప్రతి మండలంలో భవిత్ సెంటర్లు ఏర్పాటు చేసి, మండల సమాఖ్యల ఆధ్వర్యంలో నడుస్తున్న NHC సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, తీవ్ర వైకల్యం కలిగిన వారికి ప్రత్యేక అలవెన్స్ రూ.25,000 ఇవ్వాలని వేదిక డిమాండ్ చేసింది.వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.