సత్యం న్యాయం త్యాగం అనుసరణీయ గుణాలు

 *సత్యం న్యాయం త్యాగం అనుసరణీయ గుణాలు* 

 *సయ్యద్ సుల్తాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు ఆలియా సుల్తానా బేగం* 

 *ఇస్లామిక్ నూతన సంవత్సరం సందర్భంగా విద్యార్థులకు వకృత్వ పోటీలు* 

 *గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు మెడల్స్, ధ్రువపత్రాలు జారీ*

షాద్ నగర్, జూలై 4 (మనఊరు ప్రతినిధి): ఇస్లాం మతంలోనీ వీరులు ఇమామ్ హసన్, హుస్సేన్ యొక్క త్యాగం ద్వారా ప్రేరణ పొంది, ముస్లింలు సత్యం కోసం, న్యాయం, త్యాగాల కోసం నిలబడాలని, సాటి మానవులకు సహాయం చేయాలని ఇవన్నీ ఇస్లాం మత అనుసరణీయమైన గుణాలనీ షాద్ నగర్ సయ్యద్ సుల్తాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు ఆలియా సుల్తానా బేగం అన్నారు. శుక్రవారం షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో గల ప్రైమరీ ఉర్దూ మీడియం స్కూల్ లో సయ్యద్ సుల్తాన్ ఎరికేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో మొహరం నెల ప్రారంభ సందర్భంగా ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. మొహరం మాసంలో దైవ సంభూతుల అనుసరణీయ మార్గాలు అన్వేషించి వాటిని పాటించేందుకు విద్యార్థినీ విద్యార్థులు నిత్యం పటించాలని వక్తలు సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా షాద్ నగర్ ప్రముఖ మహిళా న్యాయవాది సాబియా సుల్తానా, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు 

సాలెహా ఖాలమ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకురాలు ఆలియా సుల్తానా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థులు ఉర్దూ అరబ్బీ భాషల్లో బాగా చదివి రాణించాలని సూచించారు. ఇస్లాం మత గొప్ప విషయాలను ఆకలింపు చేసుకొని వాటిని పాటిస్తే ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని ఆమె సూచించారు. ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఎప్పుడు ఏ అవసరం ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఎల్లవేళల అందుబాటులో ఉంటానని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు మొహరం ప్రత్యేకత గురించి ఎంతో గొప్పగా తమ భావాలను చెప్పారని ఆమె అభినందించారు. పిల్లలు మరింత అర్థం చేసుకునే విధంగా వారికి పాఠ్యాంశాలు బోధించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ప్రముఖ న్యాయవాది సబియా సుల్తానా మాట్లాడుతూ.. ఇస్లాం వీరుల త్యాగాన్ని మొహరం సందర్భంగా గుర్తు చేసుకుంటారనీ ఈ త్యాగం ధైర్యం, న్యాయం కోసం పోరాటం మరియు దేవుని పట్ల భక్తికి ప్రతీకగా భావిస్తారన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు పవిత్రమైన మొహర్రం మాసాన్ని పాటిస్తారనీ ఈ నెల ఇస్లామిక్ క్యాలెండర్‌లోని పన్నెండు నెలల్లో మొదటిది, తద్వారా ఇస్లామిక్ నూతన సంవత్సరాన్ని సూచిస్తుందన్నారు. ఇస్లాంలో అన్ని రకాల హింస, ముఖ్యంగా రక్తపాతం.. కచ్చితంగా నిషేధించబడిన నాలుగు పవిత్ర మాసాలలో మొహర్రం ఒకటిగా పరిగణిస్తారనీ ఈ నెలలోని మొదటి పది రోజులు వీరుల త్యాగాన్ని సూచించే విధంగా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయనీ ఎందుకంటే అవి ప్రవక్త ముహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్ బలిదానాన్ని గౌరవించే సంతాప కాలంగా గుర్తించడం జరిగిందన్నారు. తన కుటుంబం, సహచరులతో కలిసి కర్బాలా యుద్ధంలో విషాదకరంగా మరణించారనీ ఇది విశ్వాసులలో భక్తి, దుఃఖాన్ని రేకెత్తిస్తూనే ఉన్న కీలకమైన సంఘటన అని అందుకే ప్రతి మొహరం నెల సంతాప దినాలుగా పరిగణిస్తూ వారి త్యాగాలను స్మరించుకుంటామని వారు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాలెహ మాట్లాడుతూ ఇస్లాం నూతన సంవత్సర దినాన్ని పురస్కరించుకొని తమ పాఠశాలలో సయ్యద్ సుల్తాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా వక్తృత్వ పోటీలు చేపట్టినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.

Previous Post Next Post