*నేరస్తుల పాలిట విక్రమార్కుడు... అభాగ్యుల పాలిట ఆపద్బాంధవుడు..*
*శాంతి భద్రతల విషయంలో రాజీలేదు... ఉద్యోగ నిర్వహణలో అలుపే లేదు..*
*కేసుల లక్ష్య చేదనలో సాంకేతిక నైపుణ్యం...అది ఆయనకే సొంతం..*
*ఎన్నో రివార్డులు మరెన్నో ప్రశంసలు..*
*కేసు ఏదైనా సరే చేదించే వరకు ఊరుకోడు సరిగ్గా నిద్రను కూడా దరిచేరనీయడు..*
*ఉన్నతాధికారుల అభినందనలు...సహచరుల ప్రశంసలు..*
*డ్రగ్స్ రహిత సమాజమే ఆయన లక్ష్యం....ఆయనే మన షాద్ నగర్ సర్కిల్ పట్టణ సీఐ విజయ్ కుమార్...*
షాద్ నగర్, జులై 1 (మనఊరు ప్రతినిధి): లక్ష్యసాధనలో అదరక బెదరక, సాంకేతిక నైపుణ్యంతో, నేరస్తుల పాలిట పట్టు వదలని విక్రమార్కుడి లాగా, శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా, ఉద్యోగ నిర్వహణలో అలుపన్నదే లేకుండా, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ ఎన్నో కేసులను ఛేదించిన, ఎందరో అభాగ్యుల పాలిట ఆపద్బాంధవుడు మన షాద్ నగర్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తన ఉద్యోగ ప్రస్థానంలో షాద్ నగర్ పట్టణంలో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చిన్న వ్యాసం మీ ముందుకు...
*అంకితభావంతో పనిచేయడమే ఆయన లక్షణం*
ఉద్యోగ నిర్వహణలో అంకితభావంతో పనిచేసే చాలా కొద్ది మందిలో షాద్ నగర్ పట్టణ సీఐ విజయకుమార్ ఒకరు. ఆయన ఉద్యోగ నిర్వహణలో ప్రతి కేసును ఒక సవాలుగా స్వీకరించి పూర్తి అంకితభావంతో కేసు లక్ష్య చేదనలో తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, నేరస్తులను పట్టుకోవడంలో ఆయనకు ఆయనే ఒక ప్రత్యేకం. ఆ ప్రత్యేకత ఉన్నతాధికారుల వద్ద ఆయన తీసుకున్న రివార్డులు, తోటి సహచర్ల వద్ద ఆయన అందుకున్న ప్రశంసలు.
*పట్టణ సీఐ విజయకుమార్ ప్రస్థానం సాగిందిలా...*
2007వ సంవత్సరంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ నందు ఉద్యోగ ప్రస్థానం కొనసాగించిన విజయ్ కుమార్ అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఆ తర్వాత మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఆ తరువాత నల్గొండ జిల్లాలోని తిప్పర్తి పోలీస్ స్టేషన్లో, అనంతరం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక క్రమశిక్షణ కలిగిన ఎస్సైగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఎన్నో కేసులలో ఆత్మస్థైర్యంతోపాటు, ఎంతో తెలివిగా చాకచక్యంగా వ్యవహరించడంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా ఉన్న సమయంలోనే 2012 వ సంవత్సరంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి పొందారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి పొందిన తరువాత రాయదుర్గం పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా కూడా పనిచేసి ఎన్నో కేసులు లక్ష్య చేదనలో తన వంతు పాత్ర పోషించాడు. ఆయన పోలీసు శాఖలో చేస్తున్న సేవలకు గాను అప్పటి డీజీ మహేందర్ రెడ్డి సొంతంగా ఏర్పాటు చేసిన హాట్స్పాట్ ఎనాలసిస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన విజయ్ కుమార్ టీంకు 2019లో లక్ష రూపాయల రివార్డు రావడం ఆయనకు ఆయనే ఒక ప్రత్యేకత. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో మూడు సంవత్సరాలు విధులు నిర్వహించి అనంతరం శంషాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ గా కూడా తన విధులను పూర్తి కావించారు. శంషాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ గా పని చేసిన తర్వాత గత సంవత్సరం 2024, జూన్ 30వ తేదీన షాద్ నగర్ పట్టణ సీఐగా బాధ్యతలు తీసుకొని సంవత్సరం పాటు ఎలాంటి మచ్చ లేకుండా ఉద్యోగ నిర్వహణను నిర్వహిస్తూ తనదైన శైలిలో ఎన్నో కేసులను పరిష్కరించి అందరి చేత శభాష్ అనిపించుకున్న మన పట్టణ సిఐ విజయ్ కుమార్ సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు.
*నేరస్తుల పాలిట విక్రమార్కుడు... అభాగ్యుల పాలిట ఆపద్బాంధవుడు*
క్రమశిక్షణ కలిగిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగాన్ని నిర్వహిస్తూ, తన తోటి సహచరులను నిరంతరం చిరునవ్వుతో పలకరిస్తూ, తనను కలవడానికి వచ్చిన కక్షిదారులకు పూర్తి సమయం ఇస్తూ, ఎంతోమంది అభాగ్యులను వృద్ధాశ్రమాలలో చేరుస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్న పట్టణ సీఐ విజయ్ కుమార్ కేసుల లక్ష్య చేదనలో కూడా అంతే కఠినంగా ఉండడంతో ఈ ఒక్క సంవత్సరంలోనే కొలిక్కిరాని ఎన్నో కేసులను, పది మర్డర్ కేసులను, రెండు మర్డర్ ఫర్ గైన్ కేసులను, దొంగతనం కేసులను, చైన్ స్నాచింగ్ కేసులను అత్యంత తక్కువ సమయంలో చేదించి ఉన్నతాధికారుల మన్ననలను పొందాడు, ఎన్నో రివార్డులు సొంతం చేసుకున్నాడు. ఆయన చాకచక్యంతో చేసిన కేసులలో వచ్చి రాగానే కమ్మదనం ఫామ్ హౌస్ లో జరిగిన మర్డర్ కేసును 38 గంటలలోపే చేదించడం, అలాగే దూస్కల్ చెరువులో మిస్సింగ్ కేసుగా నమోదయి మర్డర్ కేసుగా మారిన ఒక మహిళ శవం కేసును చేదించడం, శ్రీనివాస కాలనీలో ఒక ప్లాస్టిక్ మూటలో మహిళా శవం కేసును చేదించడం ఇలా ఎన్నో మర్డర్ కేసులలో తనకున్న సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకొని కేసులను పూర్తి చేసి నేరస్తులను జైలుకు పంపించడం ఆయనలోని ప్రతిభాపాటవాలకు అద్దం పడతాయి. రంగారెడ్డి జిల్లాలోని అత్యధికంగా సెల్ ఫోన్లు రికవరీ చేసి వాటిని తిరిగి సెల్ ఫోన్ యజమానులకు అందించిన ఘనత కూడా ఆయనదే.
*మూర్తిభవించిన ఒక మానవతా మూర్తి మన పట్టణ సీఐ విజయ్ కుమార్*
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు, ఆ తర్వాత శంషాబాద్ లోని స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ గా పని చేసినప్పుడు ఎంతోమంది అభాగ్యులకు సొంతంగా చేయూతనిచ్చి ఎంతోమందిని వృద్ధాశ్రమంలో చేర్చడం ఆయనలోని మానవతా మూర్తికి నిదర్శనం. మొన్నటికి మొన్న మన షాద్ నగర్ పట్టణంలో కూడా ఒక వృద్ధ మహిళను ఆ మహిళ కుటుంబీకులే రైల్వే ప్లాట్ ఫామ్ పై విడిచిపెట్టి వెళితే విషయం తెలుసుకున్న మన పట్టణ సీఐ విజయకుమార్ వెంటనే స్పందించి లింగారెడ్డిగూడెం గ్రామ సమీపంలో కల ఎఫ్సీఎన్ వృద్ధాశ్రమం యాజమాన్యంతో మాట్లాడి ఆ వృద్ధ మహిళను అందులో చేర్పించడం ఆయనలోని గొప్ప మానవత్వానికి ఒక నిదర్శనం.
*డ్రగ్స్ నిర్మూలన నా ధ్యేయం... డ్రగ్స్ రహిత సమాజం నా ఆశయం... పట్టణ సీఐ విజయకుమార్*
డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలన్నదే ఆయన నిరంతర ఆశయం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం నిరంతరం ప్రయత్నం చేసే పట్టణ సిఐ విజయ్ కుమార్ పట్టణంలోని ఎన్నో పాఠశాలలలో కళాశాలలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ అందరిలో చైతన్యం తీసుకువస్తూ విద్యార్థిని విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు కాకూడదు అంటూ, డ్రగ్స్ సేవించడం వల్ల సమాజంలో అవినీతి పెరుగుతుందంటూ, కావున అందరూ డ్రగ్స్ కు దూరంగా ఉండాలంటూ విద్యార్థులకు ప్రేరణ కలిగిస్తూ ఎన్నో సమావేశాలు నిర్వహించడం ఆయనకు ఆయనే ఒక ప్రత్యేకం. క్రమశిక్షణ కలిగిన ఒక పట్టణ సీఐగా, ఎందరో అభాగ్యులను వృద్ధాశ్రమాలలో చేరుస్తున్న ఒక మానవతా మూర్తిగా, స్టేషన్కు వచ్చే కక్షిదారులకు చిరునవ్వుతో సమాధానాలు ఇచ్చే ఒక మంచి వ్యక్తిత్వం గల మనిషిగా, డ్రగ్స్ రహిత సమాజాన్ని చూడాలని ఒక సమాజ సేవకునిగా పట్టణంలో ఒక సంవత్సరం పాటు ఉద్యోగ నిర్వహణను పూర్తిచేసుకుని రెండవ సంవత్సరంలోకి అడుగుడుతున్న పట్టణ సీఐ విజయ్ కుమార్ కు శుభాభినందనలు తెలిపారు.