ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి

 ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి

టీఆర్టీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్

జంతర్‌మంతర్ వద్ద టి ఆర్ టి ఎఫ్, ఏఐఎఫ్ఈఏ ధర్నా

న్యూఢిల్లీ, డిసెంబరు, (మనఊరు ప్రతినిధి): ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఏఐఎఫ్ఈఏ) ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్టీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ మాట్లాడుతూ 2010 విద్యాహక్కు చట్టం ప్రకారం సుప్రీంకోర్టు గత సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పు ప్రకారం దేశంలోని ఉద్యోగ ఉపాధ్యాయులంతా తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్‌కు ఐదు సంవత్సరాల లోపు ఉన్న ఉపాధ్యాయులకు మాత్రమే మినహాయింపు ఇచ్చిందన్నారు. మిగతా ఎస్జీటీలు పేపర్–1, స్కూల్ అసిస్టెంట్లు పేపర్–2ను రెండు సంవత్సరాల్లో ఉత్తీర్ణులు కావాలని న్యాయస్థానం గడువు విధించిందని అన్నారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఆందోళనకు దారితీసిందని వెల్లడించారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పలు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యోగుల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు ఏఐఎఫ్ఈఏ నేతలు తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలో ఆర్టికల్ 23 (క్లాజ్–2)లో తక్షణ సవరణ చేసి, 2010కు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తిస్థాయి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని ఆయన స్పష్టం చేశారు. ఈ ధర్నాలో నాగర్‌కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మునగాల సతీష్ కుమార్ దేశ వ్యాప్తంగా వేలాదిగా ఉపాధ్యాయులు, ఏఐఎఫ్ఈఏ నేతలు పాల్గొన్నారు.







Previous Post Next Post