సర్పంచ్ ఎన్నికల్లో సంచలనం
ఓటమి తట్టుకోలేక అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
ఖాజాహైమర్పల్లిలో కలకలం
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మి
కొడంగల్, డిసెంబరు 11 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ సర్పంచ్ ఎన్నికల వేళ వికారాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొడంగల్ మండలం ఖాజాహైమర్పల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి ఓటమిని తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓటింగ్ ధోరణులు తనకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలుసుకున్న ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్టు గ్రామస్థులు తెలిపారు. ఆమెను అతి తక్కువ సమయంలో గుర్తించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ తొలి చికిత్స అనంతరం పరిస్థితి దృష్ట్యా వైద్యులు మరింత మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతూ ఉన్నారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. ఈ ఘటనతో ఖాజాహైమర్పల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
🔹 తొలి విడతలో భారీ పోలింగ్
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో మొత్తం 4,236 సర్పంచ్ పదవులకు నోటిఫికేషన్ వెలువడగా, అందులో 395 పదవులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 3,834 గ్రామాల్లో ఇవాళ పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు, కొన్ని చోట్ల చిన్నపాటి సంఘటనలు నమోదయ్యాయి.
