గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్న నిజాయితీపరులకే ఓటు వేయండి
అఖిలపక్ష ఐక్యవేదిక పిలుపు
వనపర్తి, డిసెంబర్ (మన ప్రతినిధి): రేపు జరగబోయే తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా, ఎలాంటి ప్రభావాలకు లోనుకాకుండా మంచి వ్యక్తులను గెలిపించాలని అఖిలపక్ష ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు డాక్టర్. సతీష్ యాదవ్ మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రజల మధ్య ఉంటూ సేవ చేయగలిగే, గ్రామాభివృద్ధి పట్ల అంకితభావం ఉన్న అభ్యర్థులకే ప్రజలు ఓటు హక్కు వినియోగించాలని కోరారు. ఓటర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మందు, డబ్బు కోసం ఓటు వేయడం అనేది మన చేతనే మన గ్రామాన్ని వెనుకబెట్టడం. మంచి వారిని మనమే ఎన్నుకున్నప్పుడు, గెలిచిన తర్వాత పని చేయకపోతే ఊరి మధ్యలో నిలబెట్టి ప్రశ్నించే హక్కు మనకు వస్తుంది. ప్రజలు ధైర్యంగా, నిజాయితీ ఉన్న వ్యక్తులకే ఓటు వేయాలి, అని చెప్పారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే నాయకులను ముందుకు తీసుకురావడమే లక్ష్యమని సతీష్ యాదవ్ తెలిపారు. అన్ని గ్రామాల్లో ఓటర్లు ఐక్యంగా నిలబడి, మంచి అభ్యర్థులకు ఆశీర్వాదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
