*జూనియర్ కళాశాలల్లో 273 పోస్టులకు సీఎం పచ్చజెండా*
*కాలేజీలకు ఇంటర్‌నెట్, టీవీల మంజూరుకు అంగీకారం*
హైదరాబాద్, జూలై 3 (మనఊరు ప్రతినిధి): రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2023 సంవత్సరం వరకు ఏర్పాటైన 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 273 బోధన, బోధనేతర పోస్టుల మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చజెండా ఊపారు. ఇంటర్ విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలకు ఇటీవల ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈక్రమంలో సీఎం తాజాగా పోస్టుల మంజూరు దస్త్రంపై సంతకం చేశారు. త్వరలో దానిపై జీవో జారీ కానుంది. ఆ తర్వాత టీజీపీఎస్‌సీ ద్వారా వాటిని భర్తీ చేస్తారు. రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా.. వాటిల్లో ఇంటర్‌నెట్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. దానికితోడు డిజిటల్ తరగతుల కోసం ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ), జేఈఈ, నీట్, ఎప్‌సెట్ లాంటి ఆన్‌లైన్ కోచింగ్ కోసం పెద్ద టీవీలు మంజూరుకు సీఎం అంగీకరించారని ఇంటర్‌బోర్డు వర్గాలు స్పష్టంచేశాయి.