బోనమెత్తిన లష్కర్.. తొలి బోనం

 *బోనమెత్తిన లష్కర్.. తొలి బోనం* 

 *సమర్పించిన మంత్రి ప్రభాకర్ దంపతులు* 

సికింద్రాబాద్, జూలై 13 (మనఊరు ప్రతినిధి): ఉజ్జయిని మహంకాళి అమ్మవారి(లష్కర్) బోనాలు ఇవాళ (ఆదివారం, జులై 13)న ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి కీర్తనలతో గుడి పరిసరాలు హోరెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం సమర్పించారు. అనంతరం మంత్రి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉజ్జయినికి బోనాలు సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తుల సౌకర్యార్థం ఆరు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

అలాగే బోనాలు సమర్పించడానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శివసత్తులకు ప్రత్యేకంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఆర్పీరోడ్, బాట షో రూం నుంచి ప్రవేశం కల్పించారు. దేవాలయానికి భక్తులు వెళ్లేందుకు వివిధ మార్గాల్లో పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. లష్కర్ బోనాల జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఉజ్జయిని మహంకాళి బోనాలకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Previous Post Next Post