విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న విద్యాశాఖ

 విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న విద్యాశాఖ

విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు సక్రమంగా అందరని విద్య 

విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల నియామకం గురించి పట్టించుకోని సంబంధిత అధికారులు 

పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించే సమయంలో చూపుతున్న శ్రద్ధ వాటి నిర్వహణ విషయంలో చూపకపోవడమే ముఖ్య కారణం 

ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు

రోజుకు 17 సబ్జెక్టులు బోధించడం ఒక ఉపాధ్యాయుడికి ఎలా సాధ్యం ?,

మల్టీ టీచింగ్ శిక్షణతో 

ఏకోపాధ్యాయులకు బోధనా సామర్ధ్యాలు కల్పించామంటున్న అధికారులు

దొడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు విద్యాబోధన

 నవాబుపేట, జూలై 13 (మనఊరు ప్రతినిధి): ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నడుపుతున్నామని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతుడైన ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తారని, ఆ ఉపాధ్యాయుల విద్యాబోధనలతో విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదుగుతారని బడి ఈడు గల చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు ఆ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థులకు విద్యాబోధన చేసే ఉపాధ్యాయుల నియామకాల విషయాలను పట్టించుకోవడం లేదనిపిస్తుంది.

అందువల్ల కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్జన కోసం విద్యార్థుల వెళ్లే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. గురువారం మండల పరిధిలోని దొడ్డిపల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో ఈ దుస్థితి స్పష్టంగా కనిపించింది. ఆ పాఠశాలకు రెండు పాఠశాల భవనాలు ఉండగా అందులో ఐదు తరగతులు ఉన్నాయి. 5 తరగతిలో 30 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆ 30 మంది విద్యార్థులకు విద్యాబోధన చేయడానికి పాఠశాలకు నియమించబడిన ఇద్దరు ఉపాధ్యాయులలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగ గంగాధర్ అనారోగ్య కారణాల రీత్యా మెడికల్ లీవ్ లో ఉండగా ఒకే ఉపాధ్యాయుడు అయిదు తరగతుల విద్యార్థిని విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. పాఠశాలలోని ఒకటి, రెండు, మూడు తరగతుల విద్యార్థిని, విద్యార్థులకు మూడు సబ్జెక్టులు,నాలుగు ఐదు తరగతుల విద్యార్థిని, విద్యార్థులకు నాలుగు సబ్జెక్టులు ప్రస్తుతం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఒకే ఉపాధ్యాయుడు భాను ప్రసాద్ ఒకే తరగతి గదిలో కూర్చొన పెట్టుకొని విద్యాబోధన చేస్తున్నారు. ఈ విధమైన విద్యాబోధన వల్ల విద్యార్థులకు ఎంతవరకు న్యాయం జరుగుతుందో అధికారులు ప్రజాప్రతినిధులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక ఉపాధ్యాయుడు సెలవు పై వెళ్తే మరో ఉపాధ్యాయుడిని కనీసం డిప్యూటేషన్ పైన అయినా ఆ పాఠశాలకు పంపి విద్యార్థులకు సక్రమంగా విద్యాబోధన చేయించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం వల్లే ఆ పాఠ శాలలో

ఈ దుస్థితి నెలకొన్నట్లు స్పష్టమవుతుంది. ఈ పాఠశాలలో వెంటనే విద్యార్థుల నిష్పత్తికి అనుగుణమైన రీతిలో ఉపాధ్యాయుల నియామకం జరుపకుంటే విద్య బోధన సక్రమంగా సాగే అవకాశం లేదు. అందువల్ల సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పాఠశాలకు అవసరమైనంత మంది ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు సక్రమంగా విద్యాబోధన కొనసాగేటట్లు చూడాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.

ఎంఈఓ వివరణ 

ఈ విషయమై ఎంఈఓ నాగ్య నాయక్ ను వివరణ కోరగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మెడికల్ లీవ్ లో ఉన్నందున మల్టీ టీచింగ్ పద్ధతిన ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మండలంలో ఎక్సెస్ ఉపాధ్యాయులు లేరని అందువల్ల పాఠశాలకు డిప్యూటేషన్ పై ఇతర పాఠశాలల ఉపాధ్యాయులను పంపేందుకు కూడా వీలు లేదని, సెలవుపై వెళ్లిన ఉపాధ్యాయుడు వచ్చేంతవరకు అదే పద్ధతిలో ఒక ఉపాధ్యాయుడే విధులు నిర్వహించాలని, అందుకు అవసరమైన శిక్షణను కూడా వారికి ఇచ్చామని తెలిపారు.

Previous Post Next Post