*స్థానిక సంస్థల ప్రతినిధుల సమాచారం రేపటిలోగా పంపండి*
*జెడ్పీ సీఈవోలు, డీపీవోలకు రాష్ట్ర సర్కారు ఆదేశాలు*
స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీల తాజా మాజీ ప్రజాప్రతినిధుల వివరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వహణాధికారులు (సీఈవో), జిల్లా పంచాయతీ అధికారుల(డీపీవో)కు శనివారం ఆదేశాలు జారీ అయ్యాయి. తాజా మాజీ వార్డు సభ్యుడు, సర్పంచి నుంచి మొదలుకొని ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులతోపాటు జెడ్పీఛైర్మన్, జెడ్పీటీసీ సభ్యుల కులం, ఉపకులం, పార్టీ తదితర వివరాలు పంపాలని పేర్కొంది. ప్రణాళిక శాఖ అభ్యర్థన మేరకు ఈ సమాచారాన్ని సేకరిస్తున్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల (ఎస్‌ఈఈఈపీసీ) సర్వే -2024 డేటాను విశ్లేషించడానికి ప్రభుత్వం ఒక స్వతంత్ర నిపుణుల కార్యనిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి అవసరమైన సమాచారం కోసమే ప్రణాళిక శాఖ ఈ వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 7లోగా సమాచారాన్ని తమ కార్యాలయానికి పంపాలని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ఆదేశించారు.