తెలుగు వారి తొలి పండుగ తొలి ఏకాదశి...

 తెలుగు వారి తొలి పండుగ తొలి ఏకాదశి... 

తొలి ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి 

వనపర్తి, జులై 6 (మనఊరు ప్రతినిధి): ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిని తొలి పండుగ తొలి ఏకాదశి అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఎమ్మెల్యే దంపతులు తూడిమేఘారెడ్డి, శారదారెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి దంపతులిద్దరూ లక్ష తులసి పుష్పార్చన చేశారు. ఆలయానికి వచ్చిన దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు రఘునాధచార్యులు ఆలయ చైర్మన్, వ్యవస్థాపకులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. వారి ఆధ్వర్యంలో మహిళలు సంకీర్తనల, నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందువులకు ఇది మహా పర్వదినం నేటి నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు, దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడని తెలిపారు. అంటే నేటి నుంచి సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం లోకి ప్రవేశిస్తాడని వెల్లడించారు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్ఠమైంది తొలి ఏకాదశి అన్నారు. ఈ పర్వదినాన 'గోపద్మ వ్రతం' ఆచరిస్తారు. నేటినుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు 'చాతుర్మాస్య వ్రతం' అవలంబిస్తారు. అనేక వ్యాధులకు మూలమైన క్రిమికీటకాలు సంచరించే వర్షకాలం ఇది. ఈ కాలంలో శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయం శ్రీ మహా విష్ణువు పారాయణం చేసి ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారని అర్చకులు రఘునాధచార్యులు తెలిపారు. తొలి ఏకాదశి అంటే అసలైన అర్థం పదకొండు అని అర్థం. ఇవాళ ఉపవాసం చేయడం ద్వారా ఐదు జ్ఞానేంద్రియాలు (కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం), ఐదు కర్మేంద్రియాల (నోరు, చేతులు, కాళ్ళు, పాయువు, జననేంద్రియాలు)ను మనసు అనే ఆయుధంతో ఒకతాటిపైకి తెచ్చేందుకు సాధ్యమవుతుంది. తద్వారా ఇంద్రియ నిగ్రహం పెరిగి రోగాలు దరిచేరవు. ఈ సమయంలో ప్రకతిలో వచ్చే మార్పులను శరీరం తట్టుకుని నిలబడేందుకు ఈ దీక్షను పాటించాలని పెద్దలు చెబుతారు. తొలి ఏకాదశి రోజున ఉపవాసం మనిషిలో బద్ధకాన్ని తొలగిస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థ శుద్ధి జరిగి శరీరం ఉత్తేజితమవుతుంది. శ్రీహరిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మోక్ష సిద్ధి పొందుతారని అంటారు. అలాగే తొలి ఏకాదశి నాడు పేలాలు, బెల్లం, యాలకులు కలిపి తినే ఆచారముంది. ఇది ఆరోగ్యాన్ని సంరక్షించడంతో పాటు రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post