నాగర్ కర్నూల్ లో వైభవంగా నాగుల పంచమి,గరుడ పంచమి ప్రత్యేక పూజలు...
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని వివిధ దేవాలయాల్లో పుట్టల వద్ద మహిళలచే నాగుల పంచమి ,గరుడ పంచమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో వైభవంగా పూజలు నిర్వహించారు. వినోబా నగర్ కాలనీలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, జంట నాగుల స్వామి వారికి ప్రత్యేకంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నర్వ వెంకటేశ్వర శర్మ శివప్రసాద్ భక్తులచే సామూహిక అభిషేక పూజలు చేయించారు.ఓం నగర్ కాలనీలోని పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయంలో మాడభూషి అజయ్ కుమార్ శర్మ భక్తులచే సామూహిక పంచామృత అభిషేకాలతో పాటు విశేష పూజలు నిర్వహించారు. దేవాలయం వెనుక భాగంలో గల పుట్టల వద్ద మహిళలు ప్రత్యేకంగా పూజలు చేశారు. రామాలయంలో కందాడై వరదరాజన్ అయ్యంగార్ జంటనాగుల స్వామి వారికి భక్తులచే సామూహికంగా అభిషేకాలు, అష్టోత్తరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రావణమాసంలో శుక్ల చవితి,పంచమి తిథులు లలో జంట నాగుల స్వామి వారికి పూజలు చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుందని కాలసర్ప దోషము జన్మ రిత్యా ,గోచార రీత్యా ఉన్న శాంతించడానికి ఉపకరిస్తుందన్నట్లు తెలిపారు. జంట నాగుల స్వామి వారికి విశేష పూజలు చేయడం వల్ల కళ్యాణము,సుసంతానం, విశేష ఐశ్వర్యం, జ్ఞానం ప్రాప్తిస్తున్నట్లు ఆయన తెలిపారు. పట్టణంలోనే వివిధ ప్రాంతాల నుండి మహిళా భక్తులు విడుదలవారీగా పుట్టల వద్ద దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీప దూప నైవేద్యాలు సమర్పణ చేశారు. మహిళా భక్తులు చిన్నారులు అధిక సంఖ్యలో భక్తీశ్రద్ధలతో పాల్గొన్నారు.