అయ్యో ఎంతకష్టమొచ్చే..
రోడ్డు లేక గర్భిణీని వీపుపై మోసుకెళ్లిన 108 సిబ్బంది..
సంగారెడ్డి, ఆగస్టు 10 (మనఊరు ప్రతినిధి): స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా అనేక తండాలకు సరైన రోడ్డు సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో ఈ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఒక సంఘటన దీనికి నిలువెత్తు నిదర్శనం.
నాగలిగిద్ద మండలం శాంతినగర్ తాండ పంచాయతీలోని మునియా నాయక్ తండాకు చెందిన గిరిజనులు రోడ్డు లేకపోవడంతో ప్రతిరోజూ అవస్థలు పడుతున్నారు. ఆదివారం ఉదయం మునియా తండాకు చెందిన కౌశిబాయి అనే బాలింతకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. అయితే, తండాకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయింది. వర్షం కారణంగా దారి మరింత బురదమయంగా మారడంతో నడిచి వెళ్లడం కూడా కష్టమైంది.