మెదక్ కు సీఎం



 *మెదక్‌లో కుంభవృష్టి.. సీఎం రేవంత్ పర్యటన* 

హైదరాబాద్, ఆగస్టు 28 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రిపగళ్ళు అని తేడా లేకుండా.. కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు జిల్లాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద చేరడంతో.. ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. వాగులు, నదులు పొంగిపోర్లుతున్నాయి. రహదారులపై భారీగా నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రవాణా సౌకర్యాలు దెబ్బతిన్నాయి. రోడ్లు జలమయం కావడంతో పాటు రైళ్లు కూడా రద్దు అయ్యాయి.

మెదక్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 30.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. హావేలిఘనాపూర్ మండలం సర్దనలో 30 సెంటీమీటర్ల కుండపోత వాన కురిసింది. నాగపూర్‌లో 27 సెం. మీ వర్షపాతం నమోదైంది. చేగుంటలో 22 సెం. మీ, రామయంపేట మండలాల్లో 20 సెం. మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ మేరకు మెదక్ నుంచి బోధన్, బాన్స్‌వాడ వైపు బస్సు సర్వీసులు నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. రామాయంపేట మండలంలో వర్షం ధాటికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. కాలనీలో చిక్కుకున్న ప్రజలను అధికారులు రక్షిస్తున్నారు.

కామారెడ్డి- మెదక్ సరిహద్దుల్లోని పోచారం డ్యామ్‌కు ముప్పు పొంచి ఉండటంతో.. ముందుజాగ్రత్తగా హవేలిఘనపూర్ మండలం సర్దన, జక్కన్నపేట గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. హవేలిఘనపూర్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి అక్కడికి తరలించారు. రెండు గ్రామాల ప్రజలు అర్ధరాత్రి సమయంలో ఇళ్లను వీడి పునరావాస కేంద్రానికి చేరారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ(గురువారం) జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సెలవు ప్రకటించారు. అత్యవసరం అయితేనే జిల్లా ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నంబర్ 93919 42254 కాల్ చేయాలని కోరారు.

మెదక్‌లో కుంభవృష్టి కారణంగా ఇవాళ(గురువారం) జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముంపు ప్రాంతాలను, వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి.. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎదైనా సమస్య ఉంటే అధికారులుకు వెంటనే సమాచారం ఇవ్వాలని సీఎం సూచించారు.

అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. నేడు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్.. తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ముసురు పట్టిన వాతావరణంతో పాటు అప్పుడప్పుడు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

Previous Post Next Post