కూతురు జడ్జి !
తండ్రి ఎంఈఓ !
తల్లి ఎంపిఓ !
కుమారుడు సివిల్ సర్విసెస్ కు ప్రిపేర్ !
జడ్చర్ల, ఆగస్టు 28 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల ఎంపివో సరోజ, నవాబుపేట మండల విద్యాధికారి నాగ్యనాయక్ ల కూతురు ఎస్. తేజస్విని గురువారం ఆదిలాబాద్ జిల్లా స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. చిన్నప్పటినుండి చదువులో ఎంతో చురుకుగా ఉండే తేజస్విని అతి చిన్న వయస్సులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి అందరి చేత ఔరా అనిపించుకున్నది. చిన్నప్పటి నాయుడు తల్లిదండ్రుల క్రమశిక్షణలో పెరిగిన తేజస్విని చదువులో తనకు తానే సాటిగా నిలుస్తూ ఒకేసారి రెండు తెలుగు రాష్ట్రా లలో ఉన్నతమైన జడ్జి ఉద్యోగాన్ని సాధించింది. రెండు చోట్ల ఒకేసారి బాధ్యతలు నిర్వర్తించడం సాధ్యం కాదు కనుక రెండు ఉద్యోగాలలో ఒక ఉద్యోగాన్ని వదులుకున్నది. తల్లిదండ్రులు శ్రేయోభిలాషుల సూచన మేరకు ఆదిలాబాద్ జిల్లా కోర్టులో వచ్చిన జడ్జి ఉద్యోగాన్ని నిర్వర్తించడానికి నిర్ణయించుకున్నది. జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తేజస్విని ఒకటి నుండి పదవ తరగతి వరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రిషి విద్యాలయ పాఠశాలలో, ఇంటర్మీడియట్ హైదరాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య కళాశాలలో, ఎల్ ఎల్ బి ఎల్బీనగర్ లోని మహాత్మా గాంధీ లా కాలేజీలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీలో
ఎల్ ఎల్ ఎం చేశారు. ఎలాంటి విద్యా నేపథ్యంలేని మహబూబ్ బ్ నగర్ మండల పరిధిలోని కోడూరుతాండలో ఓ వ్యవసాయ కుటుంబం లో పుట్టిననాగ్య నాయక్ వృత్తిరీత్యా నవాబుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాగా ఆయన భార్య సరోజ జడ్చర్ల మండల పరిషత్ అధికారిణి (ఎంపిఓ). భార్యాభర్తలిద్దరూ ఉన్నత విద్యావంతులు, అధికారులు కావడంతో వారి పిల్లలను కూడా అదే మార్గంలో పయనించేందుకు వారు దోహదపడ్డారు. అందువల్లనే తేజస్విని రెండు తెలుగు రాష్ట్రాలలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై పొరుగు రాష్ట్రంలో వచ్చిన అవకాశాన్ని వదులుకొని ఆదిలాబాద్ లో బాధ్యతలు చేపట్టింది. ఆమె సోదరుడు పృధ్విరాజ్ సివిల్ సర్వీస్ కు ప్రిపేర్ అవుతున్నారు. తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచితే వారి పిల్లలు తప్పకుండా ప్రయోజకులు అవుతారనే దానికి తేజస్విని జడ్జిగా నియమితురాలై బాధ్యతలు చేపట్టడానికి ఉదాహరణగా చెప్పవచ్చు. కాగా అతి చిన్న వయస్సులో జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తేజస్వినికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.