నేడు రైతాంగ సాయుధ పోరాట తొలి దళకమాండర్ కమ్మరి బ్రహ్మయ్య వర్ధంతి.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో ఒక పేజీ కమ్మరి బ్రహ్మయ్య అలియాస్ అనంతోజు బ్రహ్మయ్య
చరిత్ర నిరంతర గతిశీలమైనది. చారిత్రనుంటామే నిర్మిస్తామని, మారుస్తామని ప్రగల్బాలు పలికేవాళ్ళు కూడా చివరకు చరిత్రలోనే కలిసిపోతారు.
పాలకుర్తిలో రజాకార్లు కమ్మరి బ్రహ్మయ్య, చాకలి ఐలమ్మల ఇండ్లను తగలబెడుతుంటే ఫికర్ చేయకు మన రాజ్యం వచ్చినంక బంగ్లాలు కట్టుకుందాం అని చకిలం యాదగిరి రావు కమ్మరి బ్రహ్మయ్యను ఓదార్చినాడట. మన రాజ్యం వచ్చింది, కానీ కమ్మరి బ్రహ్మయ్యకు గుడిసె కూడా దక్కలేదు. ఆగర్భ దారిద్య్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కమ్మరి బ్రహ్మయ్య 23.08.2007 న పాలకుర్తిలోని తన గుడిసెలో తుదిశ్వాస విడిచారు. స్వరాష్ట్రం సిద్దించింది. కనీసం ఇప్పుడైనా కమ్మరి బ్రహ్మయ్యకు, ఆయన తోటి వీర యోధులకు గుర్తింపు, గౌరవం దక్కాలే. వారి వారసులమైన మనకు భూమి, భుక్తి, విముక్తి లభించాలి. ప్రకృతి వనరులు, అవకాశాలు అందరికీ సమానంగా పంచబడాలి.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ విప్లవాల పోరాటాల చరిత్రకు చుక్కానిలా నిలబడింది. ఈ వీరోచిత పోరాటానికి ముందే పాలకుర్తిలో ప్రజల తిరుగుబాటు మొలకెత్తింది. అటువంటి చారిత్రక విప్లవ తిరుగుబాటును నడిపిన విప్లవకారుడు అనంతోజు బ్రహ్మయ్య. ప్రజలు గుండెలకు హత్తుకున్న పేరు కమ్మరి బ్రహ్మయ్య.
తెలంగాణ మట్టి బిడ్డలు ఎన్నడూ మరువని నిత్య దహనశీలత కలిగిన సాయుధ పోరాటాన్ని నిర్మించి, వీరోచితంగా ముందుకు నడిపించి మతోన్మాద నైజం ఫాసిస్టు ప్రభుత్వాన్ని మట్టిలో కలిపేశారు. ఎందరెందరో వీరులు మాన, ధన, ప్రాణాల్ని తృణప్రాయంగా ఉద్యమానికి దారపోసారు. ఈ నేల మీద జరిగిన ఒక మహత్తర పోరాటం చరిత్ర పేజిల్లోకి ఎక్కలేదు. ఆ మృతవీరుల త్యాగాలు చీకటిలోకి నెట్టివేయబడ్డా జనం గుండెల్లో నిత్యం మారుమోగుతూనే ఉన్నాయి. ఈ వీరోచిత పోరాటంలో విప్లవాల పురిటిగడ్డ అయిన నల్లగొండ జిల్లాలోనే 300 మందికి పైగా అసువులు బాసారు. పోరాటంలో ప్రాణాలతో మిగిలిన వారెందరో తమ పూర్వ విప్లవ పోరాట గాథల్ని తలుచుకుంటూ అర్ధాకలితో అలమటిస్తున్నారు.
దేవరుప్పుల అడవిలో బ్రహ్మయ్య కమాండర్ గా, పన్నెండు మంది దళ సభ్యులతో దళం ఏర్పాటయింది. నాటినుంచి దొరల కంటి మీద కునుకు కరువయ్యింది. పాలకుర్తి సంఘం మీటింగ్ కు ఆరుట్ల రామచంద్రారెడ్డి వచ్చిండు. విస్నూరు గుండాలు రామచంద్రారెడ్డిని చంపుదామని వస్తే చాకలి వారి ఇంట్లో దాచినం. పాలకుర్తి సభలో బుర్రకథ చెబుతుంటే రామచంద్రారెడ్డి ఆడవేషం వేసి, తర్వాత బండిలో రాత్రికి రాత్రే వెళ్ళిపోయిండు. అప్పుడు బ్రహ్మయ్య బుర్రకథలో వంతకొట్టేవాడు. కథకుడు సాలోళ్ల శంకర్. సభలో లొల్లి అయితుంటే విస్నూరు గుండాలను తరిమికొట్టిన సాహసి. దాడికి వచ్చిన విస్నూరు గుండాల నుంచి ఆరుట్ల రామచంద్రారెడ్డిని తప్పించిన నేర్పరి. దొరల దగ్గర అన్ని కులాల జనం వెట్టి చేసేది. సబ్బండ కులాలు కన్నగల్ల సాకిరి జేసి కూలి పైసలడిగే దమ్ము కూడ లేని రోజులవి. బ్రహ్మయ్య కులవృత్తైన కమ్మరి పని చేసేది. పశువులు కాసేది, వ్యవసాయం కూడ చేసేది. బ్రహ్మయ్య దొడ్డికి ఆనుకునే పోలీస్ పటేల్ కంచె ఉంది. పెత్తర అమాస రోజున జనం అంతా పోలీస్ పటేల్ కంచెలోనుంచి నడవటంతో బయటపడింది. బ్రహ్మయ్య ఒకసారి అన్న పట్నం నుంచి తెచ్చిన కొత్త చెప్పులు తొడుక్కొని సెల్కలకు పోయిండు. పోలీసు పటేలు వచ్చి నీ గొడ్లను నా కంచెల మేపుతావురా? కుచ్చు చెప్పులు తొడుగుతావురా అని కాళ్ళ మీద కొట్టిండు. ఆ సంఘటనే బ్రహ్మయ్యను సాయుధ దళం దిశకు నడిపించింది. సంఘం వైపు పరుగులు తీయించింది. సెలకల జరిగిన విషయాన్ని సంఘపోళ్ళతోని చెబితే, వాళ్ళు సంఘముల చేరమని, చేరితే పోలీస్ పటేల్ ను కొట్టుచ్చి అంటే సంఘంలో చేరిపోయిండు. వాళ్ళు చెప్పినట్టు చేసిండు. జెండాలు కట్టేది, పాటలు పాడేది. ఎక్కడికి రమ్మంటే అక్కడికి జైకొట్టుకుంట తిరిగేది.
యాదగిరి రావు కమ్యూనిస్టుల గురించి చెప్పేది. ఈ దేశంకోసం మాతో కలిసి పని చేయాలని, అందరం కలిసి రాజ్యాన్ని దించి స్వాతంత్ర్యం తెచ్చుకుందామని చెప్పేవారు. ఉద్యమంలో చేరినాటికే బ్రహ్మయ్యకు పాలకుర్తికి దగ్గరి ఊరు వల్మిడికి చెందిన చిన్న వయసున్న లక్షితో పెండ్లయ్యింది. సాయుధ శిక్షణలో భాగంగా తుపాకీ కాల్చడం నేర్చిన తర్వాత పాలకుర్తి పోలీసు పటేలు, మాలీ పటేల్ ఇండ్లలోనుంచి తుపాకులు ఎత్తుకొచ్చేది. కదవెండి, దేవరుప్పల అడవిలో సమావేశంలో దళాలు ఏర్పాటయినాయి. పన్నెండు మంది సభ్యులతో దడిదేపల్లి, రేగుల, అవుశాపురం ఏరియాకు దళ కమాండర్ గా బ్రహ్మయ్య నిలిచాడు. దళాల్లో స్త్రీలు పాల్గొనలేదు. పాల్గొనకున్నా సహాయం చేసేది. ఇంటికింత అన్నం అడుకొచ్చి మాకు పెట్టేది. కుల మత బేధాలు లేకుండా అందరూ కలిసి తినేది. ఎక్కువ తక్కువ అనే సమస్య లేకుండా ఆరుట్ల రామచంద్రారెడ్డి, కే. రామచంద్రారెడ్డి, యాదగిరి రావు, కమ్మరి బ్రహ్మయ్యలు కలిసి దడిదేపల్లి, మల్లంపల్లి, వావిలాల, అవుశాపురం, ముత్తారం, వల్మిడి, లక్షాపురం, చీ, తొర్రూరు, వీరేంటి, బొమ్మెర, గూడూరు, ఇప్పగూడెం మొదలగు గ్రామాలన్నీ తిరిగిండ్రు. ఒక్క విస్నూరు తప్ప.
దళాల్లో పెద్ద నాయకుడు యాదగిరి రావు. బ్రహ్మయ్య దళాల్లో తిరుగుతుండని రజాకార్లు బ్రహ్మయ్య ఇంటికి నిప్పుపెట్టిండ్రు. భార్యను ఎత్తుకుపోవాలని చూస్తే ఊరోళ్ళు ఆమెకు గొల్ల ముసుగు వేసి వాళ్ళ ఇండ్లల్లో దాచుకున్నరు. ఆమెను చూసికూడా గుర్తుపట్టలేక వెళ్ళిపోయేవారు. కమ్మరి బ్రహ్మయ్య, యాదగిరి రావు, నల్ల నరసింహులు, చాకలి లచ్చయ్య, మంగలి నరసింహులు సంఘ సభ్యులంతా కలిసి కోలుకొండ ఊరిలో అబ్దుల్, రంగడు ఇంకా వంతు చాకలిని పట్టుకొని కొడితే పట్నం పోతున్నమని చెప్పిండ్రు. వాళ్లను సోదా చేస్తే దొరికిన ఉత్తరంలో పోలీసు బలగాల్ని పంపమని ఉంది. అది చూసి దొర అనుచరులైనవాళ్ళని కొట్టి తుపాకీతో కాల్చి చంపేశారు. చాకలి మాత్రం తప్పించుకొని పారిపోయాడు. తరువాత చాకలి బాబు దొరతో చెబితే దొర రజాకార్లతో ఊరిని తగలబెట్టించిండు. కోడూరు దళం దొరను చంపడానికి పోతే మంగళోల్ల ఇంట్లో దాసుకున్నడు.
దళం అంతా నల్ల నరసింహులు నాయకత్వాన పటేల్, పట్వారీల ఇండ్లను దోచింది. చాగల్లు, రాఘవాపురం దగ్గర దస్త్రాలు కాలబెట్టిండ్రు. రాత్రిళ్ళు ఊర్లల్లకు పోయి దస్త్రాలు ఊరి బయటకు తెచ్చి తగలబెట్టేది. పటేల్, పట్వారీలను కొట్టి అప్పు పత్రాలు కూడా కాల్చేది. మల్లంపెల్లి దొర బంగ్లా కూలగొట్టిండ్రు. భూస్వాముల భూములు పంచిండ్రు. పాలకుర్తి దొర భూమి కూడా పంచిండ్రు. అప్పుడు కమ్యూనిస్టులు దొరికితే తిట్టుడు, కొట్టుడు కాదు, చిత్రహింసలు పెట్టేది. రౌడీలతో కొట్టించి చంపేది. అయ్యో! అది చెప్పరాని గోస. బ్రహ్మయ్య ఎన్నోసార్లు తూటాల్నుంచి ప్రాణాల్ని రక్షించుకున్నాడు. ఒకసారి తన దగ్గరున్న తుపాకీని నీళ్లల్లో పడేసి చాకలి దగ్గర బట్టలు తీసుకొని ఉతుకుతున్నట్టు నటించి రజాకార్లను నమ్మించి చావు నుంచి బయటపడ్డాడు.
దొరల ఇండ్లను దోచినప్పుడు దొరికినవన్నీ సీల్ చేసి పైకి పంపేది. దళంలో అంతా క్రమశిక్షణగా ఉండేది. దళం వార్తల్ని రజాకార్లకు అందించేవారిని శిక్షించేది. వాళ్ళలోనే ఎవరైనా రజాకార్లకు వార్తలు చేరవేస్తే పట్టుకపోయి సావగొట్టేది. మచ్చుపాడు గుట్టల్ల ఒక రౌడీని చంపి, ఇసుక తోడి బొంద పెట్టిన్రు. వాని భార్యకు డబ్బిచ్చి వేరే ఊరికి పంపేసిండ్రు.
విస్నూరు దొర రామచంద్రారెడ్డి మొదటి భార్య చనిపోతే కొడుకుకు చూసిన అమ్మాయిని తాను చేసుకున్నాడు. దొర కొడుకు బాబు దొరకు పద్దెనిమిది ఏండ్లు ఉండే. తుపాకీ భుజానవేసుకొని గుర్రం మీద తిరిగేది. వాని వెనకాల రెండువందల మంది సాయుధులైన రజాకార్లు ఉండేది. దొరవాళ్ళు ఇండ్లను దోచి, కాల్చేవారు. పాలకుర్తిలో ఇద్దరిని గడివాములో వేసి తగలబెట్టిండు. ధర్మాపురం లంబడోల్లను మంటల్లో వేసి కాల్చేసిండు. బ్రహ్మయ్య ఇల్లును కూడా తగలబెట్టాడు.
బాబు దొర ఊళ్లలోకి వచ్చి ఆడోళ్లను చేరిచి ఆగం చేసేది. బట్టలిప్పించి బతుకమ్మలాడించేది. పాలకుర్తి, ధర్మారం, దడిదేపల్లి ఊర్లల్ల చేసిన కిరాతకాలకు లెక్కేలేదు. యాక్షనప్పుడు దళాలన్నీ కలిసి విస్నూరు బంగ్లాకు బాంబులు పెట్టాలని అనుకున్నరు. అప్పుడు ముసురు వానిచ్చింది. యూనియన్ మిలిటరీ వేసిన ఆగాయి దెబ్బలకు జనమంతా పరారయ్యిండ్రు. బాబు దొర జనగామలో బండికి పోదామని స్టేషన్ కు వచ్చిండు. ఈ వార్త తెలిసి నాలుగు ఊర్ల జనమంతా వాన్ని చావగొట్టాలని వచ్చిండ్రు. బ్రహ్మయ్య వాళ్ళు తూర్పు ప్రాంతంలో ఉండటంతో అక్కడికి పోలేదు. బాబు దొరను పట్టాల మీద పడేసిండ్రు జనం. అప్పుడే గాడి వచ్చింది. ఎక్కబోతే గుంజి కొట్టిండ్రు. తమలపాకులు వేసుకొని మరీ జనం దొర మీద ఊంచిండ్రు. కొట్టిండ్రు. తన్నిండ్రు. సావగొట్టిండ్రు.
యాక్షన్ అయిన తర్వాత బ్రహ్మయ్య మిలిటరీకి సరెండరయ్యిండు. తుపాకులు మాత్రం నాయకులు తీసుకున్నరు. బ్రహ్మయ్యను జైల్లో పెట్టిండ్రు. దళాల్ని గుంపులు గుంపులుగా లారీల మీద పట్టుకుపోయి వరంగల్ జైలుల వేసిండ్రు. బ్రహ్మయ్యను వరంగల్, ఖమ్మం తర్వాత గుల్బర్గా జైళ్లల్లో వేశారు. జైలులో తిండి తినలేక అందరూ చచ్చేది. ఉద్యమం ప్రభావంతోనే ప్రతి ఒక్కరిని ప్రశ్నించే ధైర్యం వచ్చిందని, పటేల్ పర్వారీలకు భయపడని వ్యవస్థ వచ్చిందని, ఇది కమ్యూనిస్టులు తెచ్చిన గౌరవమేనని ప్రజలన్నారు. బ్రహ్మయ్య ప్రజలకు సేవ చేశాడు కాబట్టే ప్రజలు బ్రహ్మయ్యని గుండెల్లో దాచుకున్నారు. లేకుంటే రజాకార్లకు - సాయుధ పోరాటానికి తేడా ఏమున్నది.
బ్రహ్మయ్య రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో కలికితురాయి. అన్నింటికి మించి మనుషులంటే విలువలతో బతకాలని, ప్రజల కొరకు, సమాజం కొరకు బ్రతికి చూపించిన మనిషి. మహా వీరయోధుడు. ఈ చరిత్ర మౌఖికంగా బ్రహ్మయ్య చెప్పినదే. దానిని ఎన్నో శ్రమలకోర్చి వెలుగులోకి తెచ్చి అక్షరీకరణం చేసినవారు విరువింటి గోపాలకృష్ణ, శ్రీరామోజు హరగోపాల్ లు.
ఈ పుస్తకాన్ని నాకిచ్చి, దీనిని వెంట నిలబడి రాయించి, ఆంధ్రజ్యోతిలో అచ్చు వేయించిన పాశం యాదగిరి గారికి, ఈ వ్యాసాన్ని ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన సంపాదకవర్గానికి కృతజ్ఞతలు.
~ విశ్వనాథుల పుష్పగిరి
9666435426