పార్టీలకు అతీతం : ప్రగతికి సోపానం
పార్టీలకు అతీతం :
సమిష్టి కృషి :
శుభపరిణామం
మహబూబ్ నగర్, ఆగస్టు 9 (మనఊరు ప్రతినిధి): పార్లమెంట్ నియోజకవర్గంలో జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు మహబూబ్ నగర్ ఎంపి డికె.అరుణ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిలు పార్టీలకతీతంగా సమిష్టిగా కృషి చేస్తుండడాన్ని నియోజకవర్గం ప్రజలు శుభ పరిణామంగా పరిగణిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా జడ్చర్ల నియోజకవర్గానికి త్రిబుల్ ఐటీ కాలేజీ, పట్టణానికి బైపాస్ రోడ్డు, బెంగళూరు, కోదాడ జాతీయ రహదారుల విస్తరణ, బాలానగర్ మండలంలో నవోదయ విద్యాలయం, మంజూరుకు వారు సమిష్టిగా కృషి చేస్తున్నారు. పార్టీలు వేరైనా వాటిని ఎన్నికలకే పరిమితం చేసి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిలు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికె అరుణతో కలిసి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి అక్కడ పలు ముఖ్యమైన శాఖల కేంద్ర మంత్రులను కలిసి తమకు కావాల్సిన సదుపాయాల గురించి వారికి వివరించి వాటి సాధనలో కృషి చేయడం జిల్లా ప్రజలందరిని అబ్బురపరిచింది. గతంలో అనేకమంది ఎంపీలు, ఎమ్మెల్యేలుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ కు,జడ్చర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినా వారు ఇలాంటి వాటిని ఆచరించిన దాఖలాలు తక్కువగానే కనిపించాయి.
పాలమూరు పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైన డికె అరుణ,ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డిలు ఇలాంటి వాటిని ఆచరిస్తుండటం శుభ పరిణామమనే చెప్పవచ్చునని జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వాటివల్ల నాయకుల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొనడంతో పాటు భవిష్యత్తులో స్నేహ సౌభాతృత్వాలు నెలకొనడంతో పాటు ప్రతి విషయంలో సమిష్టి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ పరిణామాలు ఆయా పార్టీల నాయకుల మధ్య నెలకొన్న వైషమ్యాలను సైతం రూపుమాపే అవకాశం ఉంది.