స్థానిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

 రాష్ట్రంలోనే ప్రప్రథమంగా స్థానిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం 

ప్రాధాన్యత సంతరించుకోనున్న దుష్యంత్ రెడ్డి పర్యటన

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే

పరోక్షంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం 

మంది మార్భలంతో గ్రామాలలో పర్యటన 

విఘ్నవినాయకుడికి పూజలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు

లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ

నవాబుపేట, సెప్టెంబరు 2 (మనఊరు ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడక ముందే కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని తలపింపజేసేలా మండలంలోని గ్రామాలలో పర్యటనలకు శ్రీకారం చుట్టారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధికార ప్రతినిధి జనంపల్లి దుష్యంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం, పర్వతాపూర్ మైసమ్మ దేవాలయ పాలక మండలి చైర్మన్ జగన్ మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ తుల్సీరాంలు మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి గ్రామాలలో పర్యటించడం ప్రారంభించారు. ఈ పర్యటనలో వారి నడక, హావ భావాలు, ప్రజలతో కలయికలు ఎన్నికల ప్రచారానికి ఏ మాత్రం తీసిపోని విధంగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నవాబుపేట మండల కేంద్రానికి చెందిన కోట్ల రాజేష్ ఇంటి దగ్గర ప్రతిష్టించిన వినాయక విగ్రహానికి ఆ నాయకులు పూజలు నిర్వహించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని గురుకుంట గ్రామంలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరమ్మ కమిటీల సభ్యులతో కలిసి నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన లబ్ధిదారులకు రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ కార్యక్రమాలన్నీ ఓ ప్రణాళిక బద్ధంగా కొనసాగడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో ముందు ఉండడం కోసమే ఈ విధమైన పర్యటనకు శ్రీకారం చుట్టినట్లుగా కనిపించింది. ఈ పర్యటన ఇకముందు నిరంతరంగా కొనసాగుతుందని పర్యటనకు నాయకత్వం వహించిన దుష్యంత్ రెడ్డి

 " మనఊరు ప్రతినిధి" తో తెలిపారు. ఆయన మాటలను బట్టి చూస్తే మండలంలో పరోక్షంగా వారు ఎన్నికల ప్రచారం ప్రారంభించినట్లుగా స్పష్టమవుతుంది.గత ఎన్నికల్లో దుష్యంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున జెడ్ పి టి సి గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమిపాలైన కూడా ఆయన మండలంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ వచ్చారు. అంతేకాక మండలంలో తన క్యాడర్ పెంపు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత 2023వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సోదరుడు అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన సమయంలో నవాబుపేట మండల ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వాటిని నిర్వర్తించి తమ్ముడి విజయంలో కీలక భూమిక పోషించారు. అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మండలంలో దుశ్యంత్ రెడ్డికి మరింత ప్రాముఖ్యత పెరిగింది. మండలంలోని గ్రామాలలో ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలన్నా ఆయన ద్వారానే తన వద్దకు రావాలని ఎమ్మెల్యే పలు సందర్భాలలో పార్టీ నాయకులు కార్యకర్తలకు సూచించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆనాటి నుండి నవాబుపేట మండలం వరకు దుష్యంత్ రెడ్డి చూసుకుంటాడు అన్న చందంగా వ్యవహారం కొనసాగుతున్నది. అంతేకాక తన గెలుపులో కీలక భూమిక పోషించిన తన సోదరుడిని నవాబుపేట మండల జడ్పిటిసిగా గెలిపించి ఆయనను జడ్పీ చైర్మన్ గా నియమింపజేసేందుకు ఎమ్మెల్యే యోచిస్తున్నట్లు సమాచారం. పలు వేదికలపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన అన్న దృశ్యంత్ రెడ్డి పోటీ చేయడం గురించి పరోక్షంగా ప్రస్తావించడం గమనార్హం. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకుల పర్యటన ముందస్తు ఎన్నికల ప్రచారంగానే భావించవచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ పర్యటన ఎన్నికల ప్రచార పరోక్ష పర్యటనగానే భావిస్తే తెలంగాణ రాష్ట్రంలోనే దుష్యంత్ రెడ్డి ప్రప్రథమంగా స్థానిక సంస్థలఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వారవుతారు.ఈ విషయమై "మన ఊరు దినపత్రిక ప్రతినిధి"ఆయనతో

మాట్లాడగా తాను యాదృచ్ఛికంగానే మండల పర్యటన ప్రారంభించానని అన్నారు. ఒకవేళ నోటిఫికేషన్ వెలువడితే కాంగ్రెస్ పార్టీ నాయకుల పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని దుష్యంత్ రెడ్డి ఈ ప్రచార పర్వానికి అందరికంటే ముందుగా శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమం ద్వారా మండలంలో తన క్రేజీని మరింత పెంచుకోవాలని ఆయన తాపత్రయ పడుతున్నారు.

అన్నకు తోడుగా ఆయన తమ్ముడు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా నవాబుపేట మండలంలో పర్యటనలకు ప్రాధాన్యతనిస్తున్నారు. అందులో భాగంగానే గతంలో కంటే ఎక్కువగా మండలంలో పర్యటనలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఇరువురు నేతలు మండలంలో పర్యటనలకు ప్రాధాన్యతను ఇస్తుండడంతో ఖచ్చితంగా వారి పర్యటనలు ఎన్నికల కోసం ముందస్తుగా వారు ప్రణాళికా బద్దంగా చేస్తున్నవేనని స్పష్టమవుతుంది.





Previous Post Next Post