గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ భాగస్వామికి ప్రశంసా పత్రం
జడ్చర్ల, సెప్టెంబరు 4 (మనఊరు ప్రతినిధి): దేశంలోని జీవిత బీమ సంస్థలన్నింటిలో అగ్రగామిగా ఉన్న భారతీయ జీవిత బీమ సంస్థ ఓ చాలెంజిగా తీసుకుని ఈ సంవత్సరం జనవరి 20వ తేది ఒకే రోజు దేశంలోని ఇతర ఏ ఎల్ఐసి సంస్థ సాధించని అత్యంత విశిష్టమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడంలో భాగస్వామిగా నిలిచిన ఎల్ఐసి ఆఫ్ ఇండియా సీనియర్ అడ్వైజర్, సీనియర్ జర్నలిస్ట్ కె.యాదిలాల్ జీకి గురువారం జడ్చర్ల ఎల్ఐసి బ్రాంచ్ సీనియర్ మేనేజర్ ఎల్. ఎల్ శంకర్ అందుకు సంబంధించిన ప్రశంసా పత్రాన్ని ప్రధానం చేశారు.
దేశంలోని ఇతర ఎల్ఐసి సంస్థలన్నింటిలోకంటే అత్యధికంగా ఒకే రోజు 24 గంటలలో 5,88,107 పాలసీలు చేసి ఎల్ఐసి ఆఫ్ ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. వృత్తి జర్నలిజం అయినా కూడా జీవనోపాధి కోసం ఎల్ఐసి ఏజెన్సీని ప్రవృత్తిగా చేపట్టిన సీనియర్ జర్నలిస్ట్ యాదిలాల్ జీ ఆ వృత్తిలో మంచి ప్రతిభ కనబరుస్తూ అనేక అవార్డులు, రివార్డులను సొంతం చేసుకుంటూ ఆ వృత్తిలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఐసి ఆఫ్ ఇండియా గిన్నీస్ రికార్డు సాధించడంలో తాను భాగస్వామిగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అత్యంత విశిష్టమైన రికార్డును ఎల్ఐసి సాధించడంలో భాగస్వామిని అయినందుకు ఎల్ఐసి ఆఫ్ ఇండియా జడ్చర్ల బ్రాంచి సీనియర్ మేనేజర్ ఎల్.శంకర్ చేతుల మీదుగా అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను గురువారం బ్రాంచి కార్యాలయంలో నిర్వహించిన ఏజెంట్ల దినోత్సవం కార్యక్రమంలో అందుకోవడం తనకు చిరస్మరణీయమని అన్నారు.ఈ సర్టిఫికెట్ ను సాధించడంలో భాగస్వాములైన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఎల్ఐసి అధికారులకు, సిబ్బందికి, కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా తన పాలసీదారులందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు.