విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా
జడ్చర్ల రూరల్, ఆగస్టు 21 (మనఊరు ప్రతినిధి): తెలంగాణలో విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్1104 రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని బి ఆర్ రెడ్డి గార్డెన్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ డివిజన్ సర్వ సభ్య సమావేశంలో నూతన డివిజన్ కార్యవర్గం కార్యదర్శి సాయిబాబా ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హార్టిజన్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా అన్ని అర్హతలు కల్పించాలని డిమాండ్ చేశారు. 2017 నుంచి హార్టిజన్ ఉద్యోగులకు రావలసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని కోరారు. విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని,క్షేత్రస్థాయిలో కిందిస్థాయి ఉద్యోగుల నియామకాలను చేపట్టాలని, కారుణ్య నియామకాలను వెంటనే నియమించాలని పేర్కొన్నారు. అనారోగ్యం బారిన ఉన్న ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేసి పదవి విరమణ పొందే విధంగా అవకాశం కల్పించాలన్నారు.
ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ డివిజన్ అధ్యక్షులుగా రామకృష్ణ
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్1104 జడ్చర్ల డివిజన్ అధ్యక్షులుగా ఎ. రామకృష్ణ, కార్యదర్లిగా కెంధ్యాల శ్రీనివాసులు, కార్యనిర్వాహణ అధ్యక్షులుగా ఎ.బి.రవికుమార్, అదనపు కార్యదర్శిగా సా.యాదయ్య, ఉపాధ్యక్షులుగా ఎ. విజయ్ కుమార్ గాడ్ లను ఎకగ్రివంగా ఎన్నుకున్నారు. అనంతరం వారిని ఆయన సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు స్వామి, పాండు, తదితరులు పాల్గోన్నారు.