బస్సులో మరిచిన బ్యాగు
ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తతతో ప్యాసింజర్‌కు చేరవేత
జడ్చర్ల బస్టాండ్‌లో విలువైన పత్రాలు సురక్షితంగా అందజేత
జడ్చర్ల, నవంబర్ (మనఊరు ప్రతినిధి): ప్రయాణీకుల కోసం ఆర్టీసీ సిబ్బంది చూపిన నిజాయితీ, అప్రమత్తత మరోసారి ప్రతిఫలించింది. మర్చిపోయిన తన బ్యాగుతో పాటు వ్యవసాయ భూముల అసలు పత్రాలు, వాహనాల ఒరిజినల్ డాక్యుమెంట్లు పోయాయని బాధపడుతున్న ప్యాసింజర్ నాగరాజుకు జడ్చర్ల ఆర్టీసీ సిబ్బంది దేవుడిలా సహకరించారు.
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం మియాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు హైదరాబాద్ నుండి షాద్నగర్ వరకు బస్సులో ప్రయాణిస్తున్నాడు. షాద్నగర్ వద్ద దిగే సమయంలో తన బ్యాగును బస్సులోనే మరిచిపోయినట్లు తరువాత గమనించాడు. వెంటనే షాద్నగర్ బస్టాండ్‌లోని ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చాడు.
కంట్రోల్ రూమ్ అధికారులు వెంటనే జడ్చర్ల బస్టాండ్‌లో విధులు చేస్తారు ఆర్టీసీ కంట్రోలర్ కే. శివరాజ్, సెక్యూరిటీ గార్డ్ లింగంపేట నరసింహులుకు వివరాలు చేరవేశారు. వారు అప్రమత్తమై జడ్చర్లకు చేరుకున్నారు. బ్యాగులోని విలువైన అసలు పత్రాలు అన్నీ సక్రమంగా ఉండటం చూసి నాగరాజు ఊపిరి పీల్చుకున్నాడు. తన పొరపాటుతో పోయే పరిస్థితి వచ్చిన విలువైన పత్రాలను తిరిగి అందజేసిన ఆర్టీసీ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. ప్రయాణీకులకు సేవలందించడంలో వారి నిజాయితీని స్థానికులు కూడా ప్రశంసిస్తున్నారు.
