ఆదర్శనీయులు దొడ్డిపల్లి గ్రామస్థులు
సర్పంచ్, ఉప సర్పంచ్ ల ఏకగ్రీవ ఎంపికకు గ్రామస్తుల తీర్మానం
నవాబుపేట, నవంబరు 28 (మనఊరు ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకుని మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని దొడ్డిపల్లి గ్రామస్థులు రాష్ట్రంలోని ఇతర గ్రామాల ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. సర్పంచ్ పదవికి బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులు పోటీ చేసేందుకు సన్నద్ధం కాగా గ్రామస్థులందరూ శుక్రవారం సమావేశమై వారిద్దరితో ఒకరిని ఎలాంటి పోటీ లేకుండా సర్పంచ్ గా, మరొకరిని ఉపసర్పంచ్ గా ఉండేందుకు ఒప్పించి ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన వల్లూరు సువర్ణను,ఉప సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీకి చెందిన దేపల్లె రాములు లను ఎంపిక చేసి ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు చేశారు.
చిన్న గ్రామంలో రాజకీయ విభేదాలు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో పాటు ఏకగ్రీవ ఎంపికకు ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షల పారితోషికం గ్రామాభివృద్ధికి వినియోగించుకుని గ్రామాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసుకోవాలంటే సదుద్దేశ్యంతో గ్రామ ప్రజలంతా ఏకమై ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇతరత్రా గ్రామాల ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. కాగా ఏకగ్రీవ తీర్మానంతో వల్లూరు సువర్ణ ఎంపిక కావడంతో జిల్లాలో మొట్టమొదటి సర్పంచ్ పదవిని కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది.


