ఎలక్షన్లపై ఉన్న శ్రద్ధ హాస్టల్ విద్యార్థులపై లేకపోవడం సిగ్గుచేటు

 ఎలక్షన్లపై ఉన్న శ్రద్ధ హాస్టల్ విద్యార్థులపై లేకపోవడం సిగ్గుచేటు

— పాలమూరు విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ సతీష్

మహబూబ్‌నగర్, డిసెంబరు 13 (మనఊరు ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్ పరిస్థితి జైళ్లకన్నా దారుణంగా మారిందని పాలమూరు విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ సతీష్ తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పే ప్రభుత్వం, హాస్టల్ విద్యార్థుల ప్రాథమిక సమస్యలను పూర్తిగా విస్మరించడం అత్యంత సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్స్‌లో సన్నబియ్యం అందిస్తున్నామని ప్రచారం చేసుకుంటోందని, అయితే వాస్తవంగా మాత్రం పాలిష్ చేసిన నాణ్యతలేని బియ్యం సరఫరా చేస్తూ భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అనేక హాస్టల్స్‌లో పురుగులు పట్టిన అన్నాన్ని విద్యార్థులు తినాల్సిన దుస్థితి నెలకొందని, ఇది విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తుతో ఆడుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలామంది హాస్టల్ విద్యార్థులు సొంత భవనాలు లేని అద్దె గదుల్లో, ఇరుకైన పరిస్థితుల్లో నివసించాల్సి వస్తోందని తెలిపారు. కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే అన్ని సంక్షేమ హాస్టల్స్‌కు పక్కా భవనాల నిర్మాణం చేపట్టి, నాణ్యమైన ఆహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. ఎన్నికలపై చూపే శ్రద్ధను హాస్టల్ విద్యార్థుల సంక్షేమంపై కూడా ప్రభుత్వం చూపించాలని సతీష్ స్పష్టం చేశారు.

Previous Post Next Post