ఎయిర్ ఫోర్స్‌లో ఎంపికైన మేదరి విద్యార్థిని శాంతిశ్రీ
మహబూబ్‌నగర్‌కు గర్వకారణం
మహబూబ్‌నగర్, డిసెంబరు 14 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీకి చెందిన మణికొండ లక్ష్మీదేవి, పవన్‌కుమార్ దంపతుల కుమార్తె ఎం. శాంతిశ్రీ తెలంగాణ రాష్ట్ర ఎయిర్ ఫోర్స్ ఎంపికల్లో ఉత్తీర్ణత సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. శాంతిశ్రీ మహబూబ్‌నగర్ మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేసి, అనంతరం నల్లగొండలోని రామయ్య డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్‌తో పాటు డిఫెన్స్ కోర్సు ప్రారంభించింది. ఈ క్రమంలో చెన్నైలో నిర్వహించిన ఓపెన్ ర్యాలీలో పాల్గొని ప్రతిభ చూపగా, బెంగుళూరులో నిర్వహించిన మెడికల్ పరీక్షల్లో కూడా మెరిట్ సాధించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం ఐదుగురు ఎయిర్ ఫోర్స్‌కు ఎంపిక కాగా, అందులో మేదరి కులానికి చెందిన విద్యార్థిని శాంతిశ్రీ ఉండడం ఎంతో ఆనందకరమని పట్టణ యువజన సంఘం అధ్యక్షుడు కేఎం. వెంకటేష్ పేర్కొన్నారు. మేదరులు సంప్రదాయ వృత్తులకే పరిమితం కాకుండా, విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని శాంతిశ్రీ నిరూపించిందని అన్నారు. ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు, కులానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యువజన సంఘం సభ్యులు శాంతిశ్రీని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కార్యదర్శి ప్రవీణ్ కుమార్, శ్రీహరి, జె. రవి, చిట్యాల మహేష్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

