గొల్లపల్లి అభివృద్ధికి అంకితమవుతా
సర్పంచ్ అభ్యర్థి ఎడ్ల కీర్తిగౌడ్
జడ్చర్ల రూరల్, డిసెంబరు 14 (మనఊరు ప్రతినిధి): మండలంలోని గొల్లపల్లి గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని గ్రామ సర్పంచ్ అభ్యర్థి, ప్రముఖ న్యాయవాది ఎడ్ల కీర్తిగౌడ్ అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న కీర్తిగౌడ్ గ్రామంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని, అభివృద్ధిలో భాగస్వామ్యంగా అందరికీ చేదోడువాదోడుగా నిలిచి పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన తండ్రి ఎడ్ల బాలవర్ధన్ లాక్‌డౌన్ సమయంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేసి, అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా తమ కుటుంబం ప్రజాసేవకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే అవకాశాన్ని తనకు ఇవ్వాలని, బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను ఆమె కోరారు.
