అనంతసాగర్‌లో కాంగ్రెస్ నేతల కుట్ర.. ఒంటరిగా లక్ష్మీకాంతమ్మ

 అనంతసాగర్‌లో కాంగ్రెస్ నేతల కుట్ర.. ఒంటరిగా లక్ష్మీకాంతమ్మ 

వెన్నుపోటు రాజకీయాల రచ్చ… 

ఇద్దరు నేతల డీల్‌తో ఒక్కరిని బలి చేశారా?”

సర్పంచ్‌ ఎన్నికల్లో సంచలనం: 

నేతల గూటికే వ్యతిరేకంగా ప్రజల ఏకతా.. లక్ష్మీకాంతమ్మకు గుప్త మద్ధతు!

కాంగ్రెస్‌లో పాత-కొత్త పాపం… స్వతంత్ర అభ్యర్థిగా లక్ష్మీకాంతమ్మ ధైర్య యాత్ర!

ఒక్క మహిళ పోరాటం ముందు నేతల ఆట బొమ్మలు బహిర్గతం

చింతకాని, డిసెంబరు 10 (మనఊరు ప్రతినిధి): మండలంలోని అనంతసాగర్ గ్రామ సర్పంచ్‌ ఎన్నికలు జిల్లాలోనే పెద్ద సంచలనంగా మారాయి. వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ… పాత కాంగ్రెస్–కొత్త కాంగ్రెస్ నేతల రహస్య ఒప్పందాలు, ప్రజలను రెచ్చగొట్టి ఒకరిపై మరొకరిని కేసులు పెట్టించిన రాజకీయ క్రీడలు ఇప్పుడు గ్రామస్థుల ఆగ్రహానికి గురవుతున్నాయి. సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో, పాత కాంగ్రెస్ తరఫున పత్తిపాటి లక్ష్మీకాంతమ్మ, కొత్త కాంగ్రెస్ తరఫున జడ ప్రమీలా పోటీలోకి దిగారు. రెండు వర్గాలు గ్రామాన్ని ఆరా తీయించాయి. కానీ రాత్రికి రాత్రే జరిగిన రహస్య ఒప్పందంలో… “సర్పంచ్ ఒకరికి – ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు మరొకరికి” అంటూ నేతలే తమవాళ్ల మధ్య వాటాలు పంచేసుకోవడంతో గ్రామం ఒక్కసారిగా కుదిపేసింది. తమపై విశ్వాసం ఉంచి పోటీకి దిగిన లక్ష్మీకాంతమ్మను పాత కాంగ్రెస్ నేతలే ఒంటరి చేసి, పోటీ నుంచి వైదొలగమంటూ తెగదెంపులు చేపట్టారు. కేవలం అంతకే ఆగకుండా… ఆమెను కూట్రపూరితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ప్రచార రథాన్ని అడ్డుకోవడం, ప్లెక్సీలు మార్చకపోతే ఊరిలోకి ఎక్కనివ్వకపోవడం, ఓటర్లపై పథకాలు ఆపేస్తామని బెదిరింపులు పెట్టడం—గ్రామంలోనే భగ్గుమంటున్న అంశాలయ్యాయి. అయినా లక్ష్మీకాంతమ్మ వెనుకడుగేయలేదు. కాంగ్రెస్ నుంచి తొలగించినా, నేతలు అవమానించినా ఎవరిపై నోరు వేసుకోకుండా స్వతంత్ర అభ్యర్థిగా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఉదయం సాయంత్రం ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు. మాటలతో కాదు… ఎన్నికల్లో గెలిస్తే చేయాల్సిన పనులను బాండ్ పేపర్‌పై స్వహస్థాలతో ముద్రించి ఇంటింటికీ పంచుతూ ఓటు కోరుతున్నారు. ఇన్నాళ్లూ మిమ్మల్ని గొడవలకు దించి, కేసులు పెట్టించి పబ్బం గడిపిన వాళ్ల రాజకీయాలకు తగిన బుద్ధి చెప్పండి అనే గ్రామస్థుల చర్చలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రస్తుత నాయకత్వం చేసిన అన్యాయం, ఒక మహిళను ఒంటరిగా చేయాలన్న దౌర్జన్యం ఇవన్నీ ప్రజలను ఒక్కటిగా చేస్తోన్నాయి. బహిరంగంగా ప్రచారంలో కనిపించకపోయినా… ఓటు మాత్రం లక్ష్మీకాంతమ్మకే వేయాలని గ్రామస్థులు వాడవాడలా మాట్లాడుకుంటున్నారు. గత 15 రోజులుగా అనంతసాగర్‌లో జరిగిన ఈ రాజకీయ పర్వం… జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రేపటితో అసలు సిసలైన ఫలితం బయటపడనుంది. నేతల రహస్య ఒప్పందాలు గెలుస్తాయా? లేక ప్రజలే అండగా నిలిచిన లక్ష్మీకాంతమ్మ స్ఫూర్తిదాయక పోరాటం విజయవంతమవుతుందా?

Previous Post Next Post