చెరువులో చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతు
జడ్చర్ల, జనవరి 31 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల సమీపంలో ఉన్న చెరువులో చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. తిమ్మాజిపేట మండలం హనుమాన్ తాండకు చెందిన రమేష్ (22) శుక్రవారం చెరువులోకి దిగగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక రిస్క్యూ టీం సహాయంతో చెరువులో గాలింపు కొనసాగుతోంది. రమేష్ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

