పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్య

 పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్య

భర్త మృతితో తీవ్ర మానసిక వేదన

తల్లి, కూతురు మృతి… 

కుమారుడు క్షేమం

మృతి చెందిన భీంశెట్టి ప్రసన్న (పైల్ ఫోటో)

కల్వకుర్తి, జనవరి 1 (మనఊరు ప్రతినిధి): నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో గుండెను కలిచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త మృతిని తట్టుకోలేక ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా ప్రాంతంలో బుక్ సెంటర్ నిర్వహిస్తున్న భీంశెట్టి ప్రకాష్ (47) గత నెల రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. భర్త మృతితో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆయన భార్య భీంశెట్టి ప్రసన్న (38) గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లలు, కూతురు మేఘన (13), కుమారుడు అశ్రీత్ రాం (15)కు అన్నంలో విషం కలిపి తినిపించి, తానూ విషం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొద్దిసేపటికి ప్రసన్న తమ్ముడు ఇంటికి వచ్చి తలుపులు తీయగా ముగ్గురు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే హుటాహుటిన వారిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో తల్లి ప్రసన్న, కూతురు మేఘన చికిత్స పొందుతూ మృతి చెందారు. కుమారుడు అశ్రీత్ రాం ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాధవరెడ్డి తెలిపారు. భర్త మృతితో ఏర్పడిన మానసిక ఒత్తిడే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు.




Previous Post Next Post