ఇద్దరు యువకుల వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
వరంగల్‌లో విషాదం
కేసు నమోదు చేసి దర్యాప్తు
వరంగల్, జనవరి 29 (మనఊరు ప్రతినిధి): ఇద్దరు యువకుల నిరంతర వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్య తండాకు చెందిన అనిత (మహిళా కానిస్టేబుల్) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం…
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్ అనే వ్యక్తి అనితను వివాహం చేసుకుంటానని నాలుగేళ్లుగా చెప్పుకుంటూ, డ్యూటీలో ఉన్న సమయంలో కూడా వీడియో కాల్స్ చేయాలని, ఇతరులతో మాట్లాడవద్దంటూ ఆమెను మానసికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజేందర్ వైఖరి నచ్చక అనిత తల్లిదండ్రులు ఈ వివాహానికి నిరాకరించారు. ఈ క్రమంలో అనిత తన స్నేహితుడు జబ్బార్ లాల్తో సన్నిహితంగా ఉంటుందని తెలుసుకున్న రాజేందర్, అతనికి అనిత గురించి తప్పుడు సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. దాంతో జబ్బార్ లాల్ కూడా అనితను వేధించడం ప్రారంభించినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ జబ్బార్ లాల్ ఒత్తిడి చేయడంతో మానసికంగా కుంగిపోయిన అనిత, ఈ విషయమై రాజేందర్‌కు ఫోన్ చేసి “మీ ఇద్దరి వల్ల నా జీవితం నాశనం అయింది” అంటూ కన్నీరు పెట్టుకున్నట్లు సమాచారం. అయితే, రాజేందర్ నిర్లక్ష్యంగా స్పందించడంతో తీవ్ర మనోవేదనకు గురైన అనిత గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు రాజేందర్, జబ్బార్ లాల్ ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలనున్నాయని అధికారులు తెలిపారు.
