రోడ్డులో ప్రమాదంలో గర్బణీ డాక్టర్ మృతి

 హంటర్‌ రోడ్డులో విషాదం..

 9 నెలల గర్భిణీ డాక్టర్ మృతి

లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోయిన కొలంబియా ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్

రోడ్డు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఘటన

వరంగల్, జనవరి 27 (మన ఊరు ప్రతినిధి): జిల్లా హంటర్‌ రోడ్డులో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని శోకసముద్రంలో ముంచెత్తింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 9 నెలల గర్భిణీ డాక్టర్‌ను లారీ ఢీకొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. కొలంబియా ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మమత (33) సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హంటర్‌ రోడ్డులో వేగంగా వచ్చిన లారీ ఆమె ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో డాక్టర్ మమత తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. డాక్టర్ మమత 9 నెలల గర్భిణీ కావడంతో ఈ ఘటన మరింత హృదయవిదారకంగా మారింది. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, వైద్య సహచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై వైద్య వర్గాలు, స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, హంటర్‌ రోడ్డులో ట్రాఫిక్ నియంత్రణ, వేగ నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు భద్రతపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Previous Post Next Post