మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్
హైదరాబాద్, జనవరి 27 (మన ఊరు ప్రతినిధి): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, ఈనెల 30 వరకు నామినేషన్లు తీసుకోనున్నారు. 31న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) చేపట్టనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించనుండగా, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో చర్చలు జోరందుకోగా, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలైంది.

