పాలెం రామలింగేశ్వర స్వామికి వెండి నాగాభరణం సమర్పణ
పాలెం గ్రామ పూర్వ విద్యార్థి దాతృత్వానికి నిదర్శనం
బిజినపల్లి, జనవరి 29 (మనఊరు ప్రతినిధి): మండలంలోని పాలెం గ్రామంలో వెలసిన శ్రీ అలర్మేలు మంగ సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయానికి అనుసంధానంగా ఉన్న శివాలయంలో కొలువైన పరమ శివుడు శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి పాలెం గ్రామ పూర్వ విద్యార్థి, హైదరాబాద్ వాస్తవ్యులు కుంభారతి మోహన్‌బాబు, ఇందిర దంపతులు, వారి కుమారులు రవిబాబు, మమత, రఘుబాబు, దీప్తిలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం నాడు వెండి నాగాభరణాన్ని సమర్పించారు. స్వామివారికి 1 కిలో 155.500 గ్రాములు (అక్షరాలా: ఒక కిలో ఒక వంద యాభై ఐదు పాయింట్ ఐదు వందల గ్రాములు) బరువుగల వెండి నాగపడగ ఆభరణాన్ని ఆలయ అర్చకులు కేవీ చక్రపాణి గారికి ఆలయంలో అందజేశారు. గతంలో స్వామివారికి ముడుపు ఉన్న నేపథ్యంలో ఈ ఆభరణాన్ని సమర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వెండి ఆభరణం విలువ సుమారు రూ.3,70,804/- గా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దాత కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ ధర్మకర్త గాడి సురేందర్, ఆలయ సిబ్బంది ఆర్. శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


